మౌలిక రంగం మెరుపు..
♦ మార్చిలో 6.4 శాతం వృద్ధి
♦ 16 నెలల గరిష్ట స్థాయి
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన కీలక మౌలిక రంగం మార్చిలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తిలో 6.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి. 2015 మార్చిలో ఈ పరిశ్రమల గ్రూప్ అసలు వృద్ధిని నమోదుచేసుకోకపోగా -0.7 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్‌లతో కూడిన ఈ మౌలిక రంగం ఉత్పత్తి వాటా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 38 శాతం. మార్చి ఐఐపీ గణాంకాలు ఈ నెల రెండవ వారంలో వెలువడతాయి. తాజా సమీక్ష నెలలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తిలో మంచి ఫలితం నమోదయ్యింది. రంగాల వారీగా వేర్వేరుగా చూసే...
దూసుకుపోయినవి...
♦ రిఫైనరీ ప్రొడక్టులు: 2015 మార్చి నెలలో ఈ రంగం -1.5 శాతం క్షీణతలో ఉంది. అయితే 2016 మార్చిలో భారీగా 10.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
♦ ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 5.2 శాతం నుంచి 22.9 శాతానికి ఎగసింది.
♦ స్టీల్: -6.5% క్షీణత నుంచి 3.4% వృద్ధికి మళ్లింది.
♦ సిమెంట్: ఈ రంగం కూడా -3.7 శాతం క్షీణత నుంచి 11.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది.
♦ విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 2 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది.
ఆర్థిక సంవత్సరం మొత్తంగా...
♦ కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) ఈ గ్రూప్ ఉత్పత్తి వార్షికంగా 4.5 శాతం నుంచి 2.7 శాతానికి పడింది.
తయారీ రంగం... 4 నెలల కనిష్టానికి
న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్/మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. మార్చిలో 52.4 పాయింట్ల వద్ద ఉన్న సూచీ... ఏప్రిల్‌లో 50.5 శాతానికి పడింది. కొత్త ఆర్డర్లు భారీగా లేకపోవడం, ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం. ఆర్‌బీఐ రెపో రేటును మరింత తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సూచీ సూచిస్తున్నట్లు మార్కిట్ ఎకనమిస్ట్ డీ లిమా పేర్కొన్నారు. కాగా పాయింట్లు 50పైన ఉంటే... దానిని విస్తరణ దశగానే పరిగణించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు.