- ఏటా భారీగా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
- గత ఐదేళ్లలో 2.83 లక్షల మంది దూరం
- అదే కాలానికి ‘ప్రైవేటు’లో 2 లక్షల మంది పెరుగుదల
- 407 ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య సున్నా!
- విద్యాశాఖ తాజా లెక్కల్లో విస్తుగొలిపే వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సర్కారీ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో తగ్గిపోతోంది. గత ఐదేళ్లలో ఏటా 50 వేల నుంచి 75 వేల మంది చొప్పున విద్యార్థులు సర్కారీ బడులకు దూరమయ్యారు. 2011-12 విద్యా సంవత్సరంలో 30.76 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 2015-16 విద్యా సంవత్సరం నాటికి 27.92 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
2011-12 నుంచి 2013-14 మధ్య కాలంలో పెరుగుదల పెద్దగా లేకపోయినా గత విద్యా సంవత్సరంతోపాటు ఈ విద్యా సంవత్సరంలో (2015-16) ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 2 లక్షలకుపైగా (2015-16లోనే 1.56 లక్షల మంది పెరుగుదల) పెరిగింది. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సర్కారు బడిపై నిరాసక్తత
సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మోడల్ స్కూల్స్, సక్సెస్ స్కూల్స్.. ఇలా పేరు ఏదైనా వివిధ పథకాల కింద విద్యాశాఖ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో సుమారు లక్షన్నర మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నా సర్కారీ విద్య సంక్షోభం వైపే పయనిస్తోంది. కొంత మంది ఉపాధ్యాయుల్లో అంకితభావం లోపించడం, విద్యా బోధనను సమీక్షించే యంత్రాంగం కొరవడటం, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లడంతో ఈ దుస్థితి నెలకొంది.
మరోవైపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడమూ ఈ సమస్యకు ఓ కారణంగా కనిపిస్తోంది. సర్కారీ స్కూళ్లలో చేర్చాలంటే పిల్లలకు ఐదేళ్లు వచ్చేదాకా ఆగాల్సి రావడం, పిల్లలను ఇంగ్లిషు మీడియం స్కూళ్లకు పంపేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలూ ఆసక్తి ప్రదర్శిస్తుండటం కూడా తల్లిదండ్రుల్లో సర్కారు బడులపై నిరాసక్తతను పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలను మూడేళ్లకే చేర్చుకోవాలని, ప్రీ ప్రైమరీ తరగతులైన ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...ఈ కారణంగానూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
991 స్కూళ్లలో పది మందిలోపే విద్యార్థులు
విద్యాశాఖ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు 405 ఉన్నాయి. 2015-16 విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం హేతుబద్ధీకరణ చేపట్టినా విద్యార్థుల్లేని స్కూళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. అలాగే 991 సర్కారీ బడుల్లో పది మందికన్నా తక్కువ మంది విద్యార్థులున్నారని... 2,376 స్కూళ్లలో 11 నుంచి 20 మంది లోపే విద్యార్థులున్నారని విద్యాశాఖ తేల్చింది.
గత ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య
సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లు
2011-12 30,76,352 30,64,343
2012-13 29,71,460 30,19,797
2013-14 29,50,739 30,64,088
2014-15 28,39,735 31,14,641
2015-16 27,92,514 32,70,799
సర్కారీ బడులకు ‘ప్రైవేటు’ గండం!
Published Mon, Mar 21 2016 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM
Advertisement