రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: కోవిడ్-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు. (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్)
ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్ బిలియనీర్ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ)
ఇదే వరుసలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్లు కోల్పోయారు. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ సంపద రెండు నెలల కాలంలో 869 మిలియన్ డాలర్లు క్షీణించింది. అలాగే గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్లను కోల్పోయారు. విప్రో షేర్లు 4.53, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5శాతం నష్టపోయాయి. ఇంకా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 -3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4-5 శాతం మధ్య కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంచ్‌మార్క్ సూచికలు 7 శాతం పతనం కావడంతో సెంటిమెంటు పూర్తిగా దెబ్బతిందనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. కరోనా మహమ్మారి ముప్పు ఊహించనదానికంటే పెద్దగా ఉండనుందని అంచనా వేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment