![Amit Shah says, Country has seen 80percent reduction in violence from terrorism in Kashmir - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/19/AMIT-SHAH.jpg.webp?itok=mqC39UGJ)
నాగపూర్: నరేంద్ర మోదీ హయాంలో కశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్యంలో∙వామపక్ష తీవ్రవాదం 80 శాతం దాకా తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. శనివారం ఇక్కడ మరాఠా వార్తా లోక్‌మత్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీకి ముందు దాకా దేశం పలు అంతర్గత భద్రతా సవాళ్లతో సతమతమవుతూ ఉండేదన్నారు. అలాంటిది గతేడాది కశ్మీర్ లోయను ఏకంగా 1.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించడం గొప్ప ఘనత అని అభిప్రాయపడ్డారు.
‘‘అంతేగాక గత 70 ఏళ్లలో మొత్తం కలిపి కశ్మీర్‌కు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వస్తే గత మూడేళ్లలోనే మరో రూ.12 వేల కోట్ల పెట్టుబడులను మోదీ ప్రభుత్వం సాధించింది. పైగా కశ్మీర్‌లో ప్రతి ఇంటికీ నల్లా నీరు, కరెంటు అందించాం. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అదుపులోకి వచ్చింది. 60 శాతం ప్రాంతాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేశాం కూడా.
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధంగా మారుతోంది. ఉపగ్రహ ప్రయోగాల్లో మనమెంతగా దూసుకెళ్తున్నదీ ప్రపంచమంతా చూస్తోంది. మన స్టార్టప్‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్‌లో ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో చూడాలన్న ప్రధాని మోదీ ఆశయం నెరవేరేందుకు ఇంకెంతో దూరం లేదు’’ అన్నారు. అందుకు తగ్గట్టుగా వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో పలు లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment