న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తరాది సహా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతో కూలింగ్ ఉత్పత్తులైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలు తగ్గినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో వీటి అమ్మకాలు గణనీయంగా నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు వినియోగదారులు వర్షాల వల్ల తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు పేర్కొన్నాయి.
ఏప్రిల్‌లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే 15 శాతం తక్కువగా నమోదైనట్టు కొన్ని సంస్థలు వెల్లడించాయి. అయితే ఎండల తీవ్రత మళ్లీ పెరిగిన తర్వాత విక్రయాలు గాడిన పడతాయని ప్యానాసోనిక్, గోద్రేజ్, డైకిన్ తదితర సంస్థలు అంచనాతో ఉన్నాయి.
‘‘ఈ ఏడా ది ఏప్రిల్‌లో వాతావరణం చల్లగానే ఉంది. దీంతో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి తక్కువగానే ఉంది. ఇప్పటివరకు కస్టమర్లు ఎక్కువ మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి వేసవి కాలం ఇంకా ఎక్కువే మిగిలి ఉంది. కనుక అమ్మకాలు పుంజుకుంటాయని ఆశావహంగా ఉన్నాం’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ (ఎయిర్ కండీషనర్లు) గౌరవ్ షా తెలిపారు.
ఉత్తరాదిన అకాల వర్షాలతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల అమ్మకాలపై ప్రభావం పడినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రా నిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు, పశ్చిమాదిన ఫ్లాట్‌గా ఉన్నట్టు సీ ఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ వెల్లడించారు.
మే నెల కీలకం..
‘‘వేసవి సీజన్‌లో అమ్మకాల వృద్ధికి మే నెల కీలకం. అనుకున్న విధంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటే డిమాండ్ పుంజుకుంటుంది. అప్పుడు మార్కెట్లో నిల్వలు గణనీయంగా తగ్గుతాయి’’అని బ్రగంజ వివరించారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదలకు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలకు మధ్య సంబంధం ఉంది. వేసవిలో దేశంలోచి చాలా ప్రాంతాల్లో వేడిగాలులు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, వేసవి సీజన్ కూడా ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, జూన్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్న అంచనాలున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు.
ఎయిర్ కండీషనర్లు నేడు లగ్జరీ ఉత్పత్తి కంటే తప్పనిసరి అవసరంగా మారిపోయినట్టు చెప్పారు. అమ్మకాల్లో అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగంగా ఉన్నట్టు తెలిపారు. తమ ఏసీ ఉత్పత్తుల అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధి ఉన్నట్టు వెల్లడించారు. 1 నుంచి 2 టన్నుల పరిధిలో 5 స్టార్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. రిఫ్రిజిరేటర్లలో ఫాస్ట్‌ఫ్రీ మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు పేర్కొన్నారు. అధిక వేడి వాతావరణం తిరిగి ఏర్పడగానే ఏసీల అమ్మకాలు పెరుగుతాయని, దీనిపై పెద్ద ఆందోళన లేదని డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్‌జీత్ జావా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment