
అల్వార్(రాజస్థాన్): కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధిపొందే రాష్ట్రంలోని పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏడాదికి 12 సిలిండర్లు ఈ ధరకే అందిస్తారు. ‘ ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అయితే ఇచ్చారుగానీ ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కి పెరగడంతో ఎవరూ కొత్తగా సిలిండర్లు బుక్‌చేయట్లేరు.
రాష్ట్రంలో ఇకపై ఉజ్వల పథకం లబ్దిదారులైన దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఈ ధరకే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తాం’ అని సోమవారం గెహ్లాట్ చెప్పారు. సోమవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్‌తోపాటు గెహ్లాట్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.