దేశ ప్రజలకు శుభవార్త. టమాట ధరల్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దిగుబడి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి టమాటలను కొనుగోలు చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాట ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. రూ.100 నుంచి రూ.300 మధ్యలో ఉన్న టమాటా ధరలు పదీ ఇరవైకి దొరకనున్నాయి.
నిన్న మొన్నటి వరకు రూ.10, రూ.20 దొరికిన కేజీ టమాట ఒక్కసారిగా రూ.100 దాటింది. కొన్ని చోట్ల రూ.150 నుండి రూ.300 మధ్యలో విక్రయిస్తున్నారు. రోజూ వినియోగించే టమాట ధరలు ఒక్కసారిగా పెరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటిని కొనడానికే వెనకాడుతున్నారు.
ఈ క్రమంలో భగ్గుమంటున్న టమాట సాగుపై కేంద్రం ఆరా తీసింది. వాటి ఆధారంగా గత ఏడాది కంటే ఈ ఏడాది టమాట పంట దిగుబడి భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. పలు నివేదికల ప్రకారం.. దేశంలో పలు రాష్ట్రాల్లో జులై నెలలో టామటా దిగుబడి 2,23,000 మెట్రిక్ టన్నుల నుంచి ఆగస్ట్‌లో 5,44,000 టన్నులకు పెరుగుతుందని సమాచారం. ఈ పెరుగుదలతో చికెన్ ధరలతో పోటీ పడుతున్న టమాట ధరలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి.
ఈ సందర్భంగా.. వినియోగదారుల వ్యవహారాలు , ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. దేశంలో ప్రధాన టమాట సాగు ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో టామాట ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉందని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి ఢిల్లీతో సహా ఉత్తరాది మార్కెట్‌లకు సరఫరా చేస్తోంది. ఈ రాష్ట్రంలో జూలైలో 2,000 మెట్రిక్ టన్నుల నుండి ఆగస్ట్‌లో 30,000 మెట్రిక్ టన్నుల వరకు టామాట పంట పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో సైతం టామాట ఉత్పత్తి పెరగనుంది. ఉత్పత్తి అంచనాలు సెప్టెంబరులో 9,56,000 మెట్రిక్ టన్నుల నుంచి అక్టోబర్‌లో గణనీయంగా 13,33,000 మెట్రిక్ టన్నులు పెరిగే అవకాశం ఉంది.
టమాట ధరలు పెరగడానికి కారణం
గత నెల జులైలో మన దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. వరదలు భీభత్స సృష్టించాయి. దీంతో పంట పొలాలు నీట మునగడం.. పంట నష్టం భారీ ఎత్తున వాటిల్లింది. ఆ ప్రభావం టమోటా సరఫరాపై ప్రభావం చూపింది. ఢిల్లీ మార్కెట్‌లో టమాట రిటైల్ ధర కేజీ రూ. 200 మించి పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గత ఏడాది జులై నెలలో టమాట 10875 మెట్రిక్ టన్నులు పండితే ఈ జూలైలో 1505 మెట్రిక్ టన్నులకు పడిపోయింది.
టమాట ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
పెరుగుతున్న టమాట ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టమాట సాగు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి కొనుగోలు చేయాలని, తరువాత వాటిని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF)లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు అమలుతో దేశంలో టమాట ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.
చదవండి👉 బ్యాంకుల్లో మూలుగుతున్న డిపాజిట్లు..అంత డబ్బును బ్యాంక్‌లు ఏం చేశాయంటే?
Comments
Please login to add a commentAdd a comment