రూ. 100 లక్షల కోట్లు | Indian market cap crosses Rs100 trillion as Sensex, Nifty hit fresh highs | Sakshi
Sakshi News home page

రూ. 100 లక్షల కోట్లు

Published Sat, Nov 29 2014 1:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

రూ. 100 లక్షల కోట్లు - Sakshi

రూ. 100 లక్షల కోట్లు

కొత్త మైలురాయిని తాకిన దేశీ స్టాక్ మార్కెట్ విలువ  
సెన్సెక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలతో పైపైకి...
 
11 ఏళ్లలో 10 రెట్లు జంప్...
5 లక్షల కోట్ల విలువతో టీసీఎస్ టాప్
రూ. లక్ష కోట్ల క్లబ్‌లో 19 బ్లూచిప్స్
సెన్సెక్స్-30 కంపెనీల విలువ రూ.47,21,345 కోట్లు

 
దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ దుమ్ముదులిపేస్తోంది. రోజుకో కొత్త రికార్డులతో చెంగుచెంగున పరుగులుపెడుతోంది. దీంతో ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ రికార్డు పరుగులతో శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్ విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కొత్త మైలురాయిని తాకింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా రూ. 100 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. ఇప్పటికే ట్రిలియన్(లక్ష కోట్లు) డాలర్ల క్లబ్‌లో దూసుకుపోతున్న దేశీ మార్కెట్ ప్రస్తుతం 1.627 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.  ఇక రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల జాబితాలో 19 బ్లూచిప్ కంపెనీలు స్థానం సంపాదించడం విశేషం.
 
మన స్టాక్ మార్కెట్లకు ఈ ఏడాదిని బుల్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2014 ఆరంభం నుంచే మొదలైన దూకుడు ఏడాది చివరివరకూ కొనసాగుతూనే ఉండటం దీనికి నిదర్శనం. మార్కెట్ జోరుతో సెన్సెక్స్ ఏకంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 35 శాతంపైగా ఎగబాకింది. అంటే 7,546 పాయింట్లు జతచేసుకుంది. శుక్రవారం కూడా సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 28,822 పాయింట్లను తాకింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (దేశీ స్టాక్ మార్కెట్ క్యాప్) ఒకానొక దశలో రూ.100,07,500 కోట్లకు ఎగబాకింది. అయితే, సెన్సెక్స్ చివర్లో కొద్దిగా దిగిరావడంతో  మార్కెట్ విలువ రూ.99,83,701 కోట్ల వద్ద స్థిరపడింది.  ఇక శుక్రవారం 8,617 పాయింట్లను తాకిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ ఏడాది ఇప్పటిదాకా 2,262 పాయింట్లు(36%) దూసుకెళ్లింది. లిస్టెడ్ కంపెనీల మొత్తం షేర్ల విలువనే మార్కెట్ క్యాప్‌గా వ్యవహరిస్తారు. దీన్నే ఇన్వెస్టర్ల మొత్తం సంపదగా చెప్పొచ్చు.

2 ట్రిలియన్ డాలర్ల దిశగా...
2007లో తొలిసారిగా మన స్టాక్ మార్కెట్ ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. అయితే, 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం మన మార్కెట్‌నూ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్ క్యాప్ రీత్యా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆతర్వాత మళ్లీ 2009 మే నెలలో ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిన దేశీ స్టాక్ మార్కెట్ ఆ తర్వాత ఒకట్రెండు సార్లు మినహా ఈ ప్రతిష్టాత్మక స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తోంది.

ప్రస్తుతం(డాలరుతో రూపాయి మారకం విలువ 61 ప్రకారం) బీఎస్‌ఈ మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ డాలర్లలో చూస్తే 1.627 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. అంటే 1,618 బిలియన్ డాలర్ల కింద లెక్క. మార్కెట్ల పరుగు ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది నెలల్లో 2 టిల్రియన్ డాలర్ల మార్కును కూడా అందుకోవడం పెద్ద కష్టమేమీకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకీ జోరు...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటపడుతోందన్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లు కూడా ఏడాది కాలంగా బలపడుతూ వస్తున్నాయి. దీనికితోడు దేశీయంగా విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరిచేలా ప్రకటించిన కొన్ని సంస్కరణలు భారత్‌పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేలా చేశాయి. మరోపక్క, నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్రం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దేశీ మార్కెట్‌ను ఉత్తేజితం చేసింది. అంచనాలకు అనుగుణంగానే మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుకూలంగా పలు రంగాల్లో పరిమితుల పెంపు, కొత్తగా రైల్వేల వంటి వాటిలోకీ ఎఫ్‌డీఐలను అనుమతించడం భారత్‌పై నమ్మకాన్ని మరింత పెంచాయి.

దీంతో స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా చూస్తే విదేశీ సంస్థాగ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో భారత స్టాక్స్‌లో నికరంగా 15 బిలియన్ డాలర్లకు పైగా(సుమారు రూ.92,000 కోట్లు)ను కుమ్మరించారు. ‘భారత్ భవిష్యత్తు ఆర్థిక శక్తిగా ఆవిర్భవించనుందని చెప్పేందుకు బీఎస్‌ఈ సాధించిన ఈ కొత్త మైలురాయి నిదర్శనం. దేశంలోని క్యాపిటల్ మార్కెట్ యంత్రాంగం ద్వారా మరింత సంపదతోపాటు ఉద్యోగాల సృష్టికి కూడా దోహదం చేయనుంది’ అని బీఎస్‌ఈ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.
 
2003లో బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లు. ప్రస్తుత 100 లక్షల కోట్లతో పోలిస్తే 11 ఏళ్ల వ్యవధిలో 10 రెట్లు పెరిగింది.
ఇక 2009లో రూ.50 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే అయిదేళ్లలో రెట్టింపు అయింది.
100 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సెన్సెక్స్-30 కంపెనీల వాటా దాదాపు సగం(రూ. 47,21,345 కోట్లు). ఇందులో టాప్-10 కంపెనీల విలువ రూ.27,83,902 కోట్లు.
ఇక బీఎస్‌ఈలో టాప్-100 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 74,12,920 కోట్లు.
పస్తుత మొత్తం మార్కెట్ విలువలో 50% వాటా కంపెనీల ప్రమోటర్లది కాగా... 20% వాటా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. మిగతాది దేశీ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్ల వద్దనున్న షేర్ల వాటా.
బీఎస్‌ఈలో ప్రస్తుతం 5,500 పైగా కంపెనీలు లిస్టయ్యాయి. లిస్టెడ్ కంపెనీల పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
 
ప్రపంచ టాప్-10 ఎక్స్ఛేంజీల్లో బీఎస్‌ఈకి స్థానం
ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్ఛేంజ్‌గా పేరొందిన మన బీఎస్‌ఈ రూ. 100 లక్షల కోట్ల మైలురాయితో మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ పరంగా ప్రపంచ టాప్-10 స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఒకటిగా(10వ ర్యాంకు) నిలిచింది. ప్రస్తుతం ఉన్న 1,627 బిలియన్ డాలర్ల విలువలో 500 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.29 లక్షల కోట్లు) ఈ ఏడాదిలోనే జత కావడం విశేషం. కాగా, ప్రపంచ నంబర్ వన్ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ విలువ 19,100 బిలియన్ డాలర్లతో పోలిస్తే మన మార్కెట్ క్యాప్ పదో వంతు మాత్రమే. ఇక మన స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) విలువ సుమారు 1,900 బిలియన్ డాలర్లుకాగా.. అమెరికా జీడీపీ విలువ 16,800 బిలియన్ డాలర్లుగా అంచనా.
 
సరికొత్త రికార్డులు
తొలిసారి 8,600కు నిఫ్టీ
28,800 దాటిన సెన్సెక్స్
క్షీణిస్తున్న చమురు ధరల ఎఫెక్ట్

వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు కూడా
 
గడిచిన రెండు రోజుల లాభాలను మించుతూ మూడో రోజు స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. ఉదయం నుంచీ పెరిగిన కొనుగోళ్లతో చివరి వరకూ లాభాలతో పరుగుతీశాయి. వెరసి అటు బీఎస్‌ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలలో మరోసారి రికార్డుల గంట మోగింది. 255 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 28,694 వద్ద నిలవగా, నిఫ్టీ 94 పాయింట్లు పుంజుకుని 8,588 వద్ద ముగిసింది. ఇవి కొత్త ముగింపులుకాగా, ఇంట్రాడేలోనూ లైఫ్‌టైమ్ గరిష్టాలు నమోద య్యాయి. మిడ్ సెషన్‌లో 383 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్ తొలిసారి 28,822ను తాకగా, నిఫ్టీ 8,617కు చేరింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు కళకళలాడాయి.

ఇవీ కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2010 ఆగస్ట్ స్థాయికి పతనంకావడంతో సెంటిమెంట్ మెరుగైందని నిపుణులు పేర్కొన్నారు. బ్రెంట్ ర కం ముడిచమురు ధర బ్యారల్‌కు 72 డాలర్ల స్థాయికి పడిపోగా, నెమైక్స్ సైతం 69 డాలర్ల వద్ద కదులుతోంది. చమురు ధరల క్షీణతతో ధరలు దిగివస్తాయని, తద్వారా వడ్డీ రేట్ల తగ్గింపునకు రిజర్వ్ బ్యాంక్‌నకు వీలు ఏర్పడుతుందన్న అంచనాలు బ్యాంకింగ్ షేర్లకు బూస్ట్‌నిచ్చాయి. పీఎస్‌యూ దిగ్గజాలు పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, బీవోబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ 8-5% మధ్య పురోగమించగా, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు ఇండస్‌ఇండ్, కొటక్ మహీంద్రా, యాక్సిస్, యస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ 4-2% మధ్య ఎగశాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement