21 నెలల కనిష్టానికి సూచీలు
♦ 262 పాయింట్ల నష్టంతో
♦ 23,759 పాయింట్లకు సెన్సెక్స్
కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనితో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్ గణనీయంగా నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 నెలల కనిష్టానికి క్షీణించాయి. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం మరింత తక్కువగా 23,938 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 23,637 పాయింట్ల స్థాయికి కూడా క్షీణించింది. చివరికి 262 పాయింట్ల నష్టంతో (దాదాపు 1%) దాదాపు 21 నెలల కనిష్టమైన 23,759 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 12న సెన్సెక్స్ చివరిసారిగా 23,551 వద్ద ముగిసింది. ఆ తర్వాత ఇదే కనిష్టం. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు (1.13శాతం) తగ్గి 21 నెలల కనిష్టం 7,216 వద్ద ముగిసింది. చివరిసారిగా 2014 మే 16 నిఫ్టీ 7,203 పాయింట్ల స్థాయిలో ముగిసింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో బ్యాంకింగ్ స్టాక్స్ సూచీ 2 శాతం పైగా క్షీణిం చింది. కాగా మందగమనం భయాలతో ఆసియా మార్కెట్లు బలహీనంగానే ముగిశాయి. జపాన్‌కి చెందిన నికాయ్ 2.31% నష్టపోయింది. క్రితం రోజున ఇది 5.41% పడింది. సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ కూడా 1.57% తగ్గింది. వరుసగా ఏడు సెషన్ల పాటు తగ్గిన యూరప్ సూచీలు మాత్రం మెరుగ్గా ట్రేడయ్యాయి.
బలహీనంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ: డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీన ధోరణిలోనే ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం డాయిష్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 7 శాతం పైగానే వృద్ధి రేటు నమోదవుతున్నా... ఆర్థిక వృద్ధి ధోరణి మాత్రం బలహీనంగానే కనిపిస్తోందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనావేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. పలు సర్వేలు, గణాంకాలు ఆర్థిక వ్యవస్థ బలహీనతలను తెలియజేస్తున్నాయని బ్యాంక్ నివేదిక వెల్లడించింది. కాగా బడ్జెట్ అనంతరం ఆర్‌బీఐ రెపో రేటు పావుశాతం తగ్గుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేసింది.