ఆఖర్లో ‘కొనుగోళ్ల’ రికవరీ..
► సెన్సెక్స్ 190 పాయింట్లు లాభం
► 7,100 పాయింట్ల పైకి నిఫ్టీ
ముంబై: ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 23,382 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 7,100 మైలురాయిని దాటి 60 పాయింట్ల లాభంతో 7,108 వద్ద ముగిసింది. భారీగా పతనమైన షేర్లు.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్‌ల్లో కొనుగోళ్లు జరిగాయి. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లలో కొనుగోళ్లతో సెంటిమెంటు మెరుగుపడింది. అయితే, రూపాయి మారకం విలువ ఒక దశలో 30 నెలల కనిష్టమైన 68.67 శాతానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు కొంత ఆచితూచి వ్యవహరించారు.
మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ దేశీ సూచీలు బుధవారం ప్రతికూలంగా మొదలైనప్పటికీ.. ఆ తర్వాత యూరోపియన్ సూచీలు ప్రారంభమయ్యాక లాభాల్లోకి మళ్లినట్లు హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ జైన్ చెప్పారు. సెన్సెక్స్ 23,435-22921 మధ్య తిరుగాడి చివరికి 190 పాయింట్లు (0.82 శాతం) పెరుగుదలతో 23,382 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ 7,124 - 6,961 మధ్య తిరుగాడింది. ఎగుమతుల తగ్గుదల గణాంకాలతో క్రితం రోజు బ్లూచిప్ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో సెన్సెక్స్ 362 పాయింట్లు క్షీణించింది.
జేఎస్‌పీఎల్ మరింత డౌన్..
షేర్ల విషయానికొస్తే... జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లలో అమ్మకాలు రెండో రోజూ కొనసాగాయి. కంపెనీ రుణభారంపై ఆందోళనలతో షేరు మరో 3.47 శాతం క్షీణించింది. యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ మరో 5 శాతం తగ్గింది. అయితే షేర్ల బైబ్యాక్ కారణంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ స్టాక్స్ 4 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 21 స్క్రిప్స్ పెరిగాయి.