బేర్ విశ్వరూపం | The first of the new year, to the extreme hampered by domestic stock market | Sakshi
Sakshi News home page

బేర్ విశ్వరూపం

Published Wed, Jan 7 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

బేర్  విశ్వరూపం

బేర్ విశ్వరూపం

సెన్సెక్స్ 855 పాయింట్లు క్రాష్... 27,000 దిగువకు
నిఫ్టీ 251 పాయింట్ల పతనం; 8,127 వద్ద క్లోజ్
పాయింట్ల లెక్కన ఐదున్నరేళ్లలో ఇదే అతిపెద్ద పతనం...
శాతాలవారీగా చూస్తే మాత్రం పడింది 3 శాతమే
వెంటాడిన ‘గ్రీస్’ భయాలు.. ముడిచమురు ధర
ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఆందోళనలూ తోడు
చమురు-గ్యాస్, రియల్టీ, లోహ షేర్లు విలవిల...

 
కొత్త ఏడాదిలో తొలిసారి దేశీ స్టాక్ మార్కె ట్‌కు తీవ్రమైన దెబ్బతగిలింది. ముందురోజు అమెరికా, యూరప్ మార్కెట్లలో భారీ పతనం ప్రభావంతో మన మార్కెట్లు కూడా గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. క్రితం ముగింపు 27,842 పాయింట్లతో పోలిస్తే 140 పాయింట్లకు పైగా నష్టంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ మొదలైంది. ఇక ఆ తర్వాత నుంచీ పతనం మరింత తీవ్రతరమైంది. ఒకనొక దశలో 905 పాయింట్లు ఆవిరై 27,000 దిగువకు పడిపోయింది. చివరకు 855 పాయింట్ల క్షీణతతో 26,987 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే... 251 పాయింట్లు కుప్పకూలి... 8,127కు దిగజారింది. రెండు ప్రధాన సూచీలూ 3 శాతం చొప్పున పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ తాజా ముగింపులు రెండున్నర వారాలకుపైగా కనిష్టస్థాయిలు కావడం గమనార్హం.

పతనానికి పరాకాష్ట...: ఇటీవలి కాలంలో ఎన్నడూ చవిచూడని అత్యంత ఘోరమైన నష్టాన్ని దేశీ మార్కెట్లు మూటగట్టుకున్నాయి. 2009 జూలై 6న సెన్సెక్స్ 869 పాయింట్లు... నిఫ్టీ 258 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. అంటే ఐదున్నరేళ్ల తర్వాత ఇంత భారీ నష్టాలు ఇదే తొలిసారి. శాతాలపరంగా చూస్తే.. 2013 సెప్టెంబర్‌లో ఇదే స్థాయిలో (3%) క్షీణత నమోదైంది.

అన్నీ నేలచూపులే...: దేశీ మార్కెట్లో ఎడాపెడా అమ్మకాలతో బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలూ తీవ్ర నష్టాలతో ముగిశాయని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రధానంగా చమురు-గ్యాస్ రంగం ఇండెక్స్‌అత్యధిక పతనాన్ని(4.17 శాతం) మూటగట్టుకుంది. రియల్టీ 3.66 శాతం, మెటల్ సూచీ 3.49 శాతం, యంత్రపరికాల ఇండెక్స్ 3.24 శాతం, విద్యుత్ రంగం సూచీ 3.13 శాతం చొప్పున భారీగా కుప్పకూలాయి. మరోపక్క, బ్లూచిప్స్ బాటలోనే...  బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు 2.95 శాతం చొప్పున క్షీణించాయి.
 ప్రపంచ మార్కెట్లన్నీ
 
పతనంవైపే..

గ్రీస్ భయాలు, క్రూడ్ పతనం, ఆర్థిక మందగమనం ఆందోళనలతో సోమవారం రాత్రి యూరప్ మార్కెట్లు కుప్పకూలాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ప్రధాన దేశాల సూచీలు 3 శాతంపైగా నష్టపోయాయి. అమెరికా ప్రధాన సూచీలైన డోజోన్స్ 330 పాయింట్లు, నాస్‌డాక్ 84 పాయింట్ల చొప్పున దిగజారాయి. దీని ప్రభావం మంగళవారం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్, హాంకాగ్, సింగపూర్, తైవాన్, దక్షిణకొరియా వంటి ప్రధాన సూచీలు 0.32 శాతం-3 శాతం స్థాయిలో నష్టపోయాయి. చైనా షాంఘై ఇండెక్స్ మాత్రం స్వల్పంగా 0.03% లాభపడింది. మంగళవారం కూడా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ఇండెక్స్‌లు భారీ పతనబాటలో కొనసాగుతున్నాయి. అమెరికా సూచీల్లో డోజోన్స్ 178 పాయింట్లు, నాస్‌డాక్ 78 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి.
 
ఇవీ ముఖ్యాంశాలు...

     
మంగళవారం నాటి క్రాష్ ప్రభావంతో బీఎస్‌ఈలో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(ఇన్వెస్టర్ల సంపదగానూ వ్యవహరిస్తారు) రూ.2.9 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.96.74 లక్షల కోట్లకు పడిపోయింది.సెన్సెక్స్‌లో 30 షేర్లకు గాను 29 నష్టాల పాలయ్యాయి. హెచ్‌యూల్ మాత్రమే 1.89 శాతం లాభంతో ముగిసింది.ఇక నిఫ్టీలోని 50 షేర్ల జాబితాలో 48 షేర్లు నష్టపోయాయి.సెన్సెక్స్‌లో అత్యధికంగా ఓఎన్‌జీసీ 5.89% పడిపోయింది.
 
తర్వాత స్థానాల్లో సెసా స్టెరిలైట్(5.09 శాతం), టాటా స్టీల్(4.88 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ(4.69 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్(4.67%), భెల్(4.45%), టాటా మోటార్స్(4.39%), ఐసీఐసీఐ బ్యాంక్(4.2%), ఎస్‌బీఐ(4.05%), టాటా పవర్(3.92%), టీసీఎస్(3.60%), యాక్సిస్ బ్యాంక్(3.54%), హీరో మోటోకార్ప్(3.43%), ఎల్‌అండ్‌టీ(3.38%), గెయిల్(3.2%), ఎన్‌టీపీసీ(3.13%) చొప్పున దిగజారాయి..

మార్కెట్లో క్రాష్‌ను ప్రతిబింబిస్తూ... ట్రేడయిన ప్రతి నాలుగు స్టాక్స్‌లో ఒకటి నష్టపోవడం గమనార్హం.విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కూడా ఇటీవల ఎన్నడూ లేనంత భారీ ఎత్తున అమ్మకాలు జరిపారు. ప్రాథమిక గణాంకాల ప్రకారం... రూ.1,570 కోట్ల మేర స్టాక్స్‌ను నికరంగా విక్రయించినట్లు అంచనా. అయితే, దేశీ సంస్థలు(డీఐఐలు) రూ.1,190 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం.ఎన్‌ఎస్‌ఈ క్యాష్ విభాగంలో రూ.17,100 కోట్లు, బీఎస్‌ఈ నగదు విభాగంలో రూ.3,139 కోట్ల మేర టర్నోవర్ నమోదైంది. ఇక ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌లో రూ.2.91 లక్షల కోట్లు, బీఎస్‌ఈలో రూ.23,690 కోట్ల  టర్నోవర్ నమోదయింది.నిఫ్టీ ఫ్యూచర్స్ జనవరి కాంట్రాక్టు ధర అకస్మాత్తుగా 8,000 పాయింట్ల కనిష్టాన్ని తాకడంతో ఫ్లాష్ క్రాష్(ఫ్యాట్ ఫింగర్ ట్రేడ్) లాంటిదేమైనా జరిగిందా అన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అలాదేమీ లేదని... ట్రేడింగ్ సాధారణ పరిస్థితుల్లోనే కొనసాగిందని ఎన్‌ఎస్‌ఈ వర్గాలు స్పష్టం చేశాయి.
 
బేర్ పంజా విసిరింది. స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో ‘అమంగళ వారం’ నమోదైంది. రివ్వున పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి. యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగొచ్చన్న భయాలకు తోడు... ముడిచమురు ధర మహా పతనం ప్రపంచ మార్కెట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీనికితోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు ద‘లాల్’స్ట్రీట్‌తో పాటు విదేశీ సూచీలను అతలాకుతం చేశాయి. సెన్సెక్స్ ఐదున్నరే ళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఏకంగా 855 పాయింట్లు కుప్పకూలి... 27,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. చమురు, గ్యాస్; రియల్టీ, లోహ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. మంగళవారం ఒక్కరోజే దేశీ ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement