ఐటీ, ఫార్మా షేర్లలో ‘స్వీకరణ’
⇒మార్కెట్ అప్‌డేట్
⇒సెన్సెక్స్ 134 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణత
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్ గురువారం క్షీణించింది. సెన్సెక్స్ 134 పాయింట్లు తగ్గి 28,666 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల కనిష్టం. అటు నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 8,707 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణ జరిపారు.
అమెరికా, ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణుల మధ్య దేశీ మార్కెట్ ఒకింత మెరుగ్గానే ప్రారంభమైంది. కానీ మధ్యాహ్నం కల్లా ఆ లాభాలన్నీ ఆవిరై సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లు మేర క్షీణించింది. అయితే, రిఫైనరీ రంగ సంస్థలతో పాటు మరికొన్ని స్టాక్స్‌లో కొనుగోళ్లు జరగడంతో మళ్లీ కాస్త కోలుకుంది. చివరికి 0.46 శాతం నష్టంతో 28,666 పాయింట్ల వద్ద ముగిసింది.
ఏప్రిల్ 7 నాటి 28,517 పాయింట్ల స్థాయి తర్వాత ఇదే కనిష్టం. ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ లాభాల స్వీకరణపై దృష్టి పెట్టడంతో దేశీ ఈక్విటీలు బలహీనంగా ట్రేడయినట్లు వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ప్రధాన ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్‌లు 1-1.7 శాతం మధ్య క్షీణించాయి.
ఎస్‌అండ్‌పీ, బీఎస్‌ఈ ఆల్‌క్యాప్ ఇండెక్స్ ప్రారంభం
ముంబై: బీఎస్‌ఈ, ఎస్ ఆండ్ పీ డోజోన్స్‌ల జాయింట్ వెంచర్ ఆసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం ‘బీఎస్‌ఈ, ఎస్ అండ్ పీ ఆల్‌క్యాప్ ఇండెక్స్’తోపాటు మరో 18 ఇండెక్స్‌లను ప్రారంభించింది. ఆల్‌క్యాప్ ఇండెక్స్‌లో 700 లిస్టెడ్ కంపెనీల స్టాక్స్ భాగంగా ఉంటాయి. ఈ కొత్త ఇండెక్స్‌ను లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, లార్జ్‌మిడ్‌క్యాప్, మిడ్‌స్మాల్‌క్యాప్‌లు అనే ఐదు రకాల ఇండెక్స్‌లుగా, పది రంగాలకు సంబంధించిన ఉప ఇండెక్స్‌లుగా విభజిస్తారు.
ఆ పది రంగాలలో మెటీరియల్స్, వినియోగదారు వస్తు సేవలు, ఎనర్జీ, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్, ఐటీ, టెలికం, యుటిలిటీస్‌లు ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, హెల్త్‌కేర్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీలకు సంబంధించిన ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ ఇండెక్స్ స్థానంలో కొత్త ఇండెక్స్‌లు రానున్నాయి.