మార్కెట్ ః 100 లక్షల కోట్లు
మార్కెట్ అప్‌డేట్ చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు సాధించింది. తొలిసారి ముగింపులో రూ. 100 లక్షల కోట్ల విలువను నిలుపుకుంది. వాస్తవానికి గత శుక్రవారం ఇంట్రాడేలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. అయితే ఆపై అమ్మకాల కారణంగా వెనక్కి తగ్గింది. కాగా, బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 1,00,40,625 కోట్ల(1.6 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలవడం ద్వారా మార్కెట్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు బ్లూచిప్స్‌తోపాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం పురోగమించడం లాభించింది. ఈ ఏడాదిలోనే మార్కెట్ విలువకు రూ. 29 లక్షల కోట్లు(500 బిలి యన్ డాలర్లు) జమకావడం చెప్పుకోదగ్గ విశేషం! 2009లో నమోదైన రూ. 50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2003లో ఉన్న రూ. 10 లక్షల విలువతో పోలిస్తే 10 రెట్లు ఎగసింది!! తద్వారా విలువరీత్యా ప్రపంచంలోని టాప్-10 ఎక్స్ఛేంజీలలో బీఎస్‌ఈ స్థానాన్ని పొందింది. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్ ఒక్కటీ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది.
అక్కడక్కడే....
ఉదయం నుంచీ పలుమార్లు ఒడిదుడుకులకు లోనైన మార్కెట్ చివరికి మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ నామమాత్రంగా ఒక పాయింట్ నష్టపోయి 28,443 వద్ద నిలవగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 8,538 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,929 లాభపడితే, 1,082 మాత్రమే నష్టపోయాయి. 200 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకడం విశేషం. సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, భెల్ 2.5%పైగా పురోగమించగా, డాక్టర్ రెడ్డీస్ అదే స్థాయిలో డీలాపడింది.