Capitalization
-
ఇంటర్‌గ్లోబ్ విలువ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండ్ విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. లక్ష కోట్లను తాకింది. వెరసి దేశీయంగా ఈ మైలురాయిని చేరిన తొలి ఎయిర్‌లైన్స్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లడంతో కంపెనీ తాజా ఫీట్‌ను సాధించింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 5 శాతమే బలపడటం గమనార్హం! బుధవారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఇండిగో షేరు 3.6 శాతం జంప్‌చేసింది. బీఎస్ఈలో రూ. 2,620కు చేరగా.. ఎన్ఎస్ఈలో రూ. 2,621 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,634 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,01,007 కోట్లను అధిగమించింది. సోమవారం ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలుకి ఆర్డర్ జారీ చేసింది. తద్వారా ఎయిర్‌బస్ చరిత్రలోనే భారీ కాంట్రాక్టుకు తెరతీసింది. దీర్ఘకాలిక వృద్ధిలో భాగంగా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో ఇండిగో కౌంటర్ జోరందుకుంది. ఇందుకు సరికొత్త గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు సైతం దోహదపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశీయంగా అతిపెద్ద విమానయాన కంపెనీగా నిలుస్తున్న ఇండిగో అంతర్జాతీయంగా విస్తరించేందుకూ ప్రణాళికలు అమలు చేస్తోంది. దేశీయంగా కంపెనీ మార్కెట్ వాటా 61 శాతానికిపైగా నమోదుకావడం విశేషం! -
రిలయన్స్ @రూ.8 లక్షల కోట్లు
ముంబై: ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన రికార్డ్‌ను సాధించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా నిలిచింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,274ను తాకిన ఈ షేర్ చివరకు 1.8% లాభంతో రూ.1,270 వద్ద ముగిసింది. ఈ షేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం ఒక్క రోజే రూ.15,527 కోట్లు పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ రూ.8,04,691 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం వరకూ లాభపడింది. ఏజీఎమ్ నుంచి జోరు...: గతనెలలో జరిగిన ఏజీఎమ్‌లో ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో గిగా ఫైబర్(ఫైబర్–టు–ద హోమ్ సర్వీస్)ను ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ఈ షేర్ గత నెల 12న 10, 000 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా అవతరించింది. 2007లో ఈ ఘనత సాధించిన ఈ కంపెనీ మళ్లీ అదే ట్యాగ్‌ను ఈ ఏడాది పొందింది. గత నెల 13న ఈ కంపెనీ మార్కెట్ క్యాప్‌రూ.7 లక్షల కోట్లను అధిగమించింది. నెలన్నర రోజుల్లోనే మరో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌ను జత చేసుకొని 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా గురువారం అవతరించింది. -
హెచ్డీఎఫ్సీ గ్రూప్ @ 10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగంలోని ప్రముఖ కార్పొరేట్ గ్రూపు హెచ్డీఎఫ్సీ... మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. టాటా గ్రూపు తర్వాత రూ.10 లక్షల కోట్ల మార్కును చేరుకున్న రెండో గ్రూపు హెచ్డీఎఫ్సీ కావడం గమనార్హం. బ్యాంకింగ్, గృహరుణాలు, బీమా ఉత్పత్తులు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా భిన్న రకాల ఆర్థిక సేవల్లో హెచ్డీఎఫ్సీ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రూపులో భాగమైన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, గృహ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్నాయి. మరో సంస్థ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఐపీవో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఒక్క కంపెనీ మార్కెట్ విలువ రూ.30,000 కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. హెచ్డీఎఫ్సీ బ్యాంకు టీసీఎస్, ఆర్ఐఎల్ తర్వాత దేశంలోనే అత్యంత విలువైన మూడో కంపెనీ. హెచ్డీఎఫ్సీ నాలుగు దశాబ్దాలుగా గృహ రుణ వ్యాపార కార్యకలాపాల్లో ఉంటే, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 25 ఏళ్లుగా పనిచేస్తోంది. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ 20 ఏళ్ల నుంచి, గృహ్ ఫైనాన్స్ 30 ఏళ్ల నుంచి వ్యాపారంలో ఉన్నవే. హెచ్డీఎఫ్సీ గ్రూపు కంపెనీలన్నింటికీ మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్. ఇందులో 76 శాతం వాటాదారులు ఎఫ్ఐఐలే కావడం గమనార్హం. -
మార్కెట్ ః 100 లక్షల కోట్లు
మార్కెట్ అప్డేట్ చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ మరోసారి దేశీ స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు సాధించింది. తొలిసారి ముగింపులో రూ. 100 లక్షల కోట్ల విలువను నిలుపుకుంది. వాస్తవానికి గత శుక్రవారం ఇంట్రాడేలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలిసారి రూ. 100 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. అయితే ఆపై అమ్మకాల కారణంగా వెనక్కి తగ్గింది. కాగా, బుధవారం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 1,00,40,625 కోట్ల(1.6 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలవడం ద్వారా మార్కెట్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు బ్లూచిప్స్‌తోపాటు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం పురోగమించడం లాభించింది. ఈ ఏడాదిలోనే మార్కెట్ విలువకు రూ. 29 లక్షల కోట్లు(500 బిలి యన్ డాలర్లు) జమకావడం చెప్పుకోదగ్గ విశేషం! 2009లో నమోదైన రూ. 50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2003లో ఉన్న రూ. 10 లక్షల విలువతో పోలిస్తే 10 రెట్లు ఎగసింది!! తద్వారా విలువరీత్యా ప్రపంచంలోని టాప్-10 ఎక్స్ఛేంజీలలో బీఎస్ఈ స్థానాన్ని పొందింది. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్ ఒక్కటీ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. అక్కడక్కడే.... ఉదయం నుంచీ పలుమార్లు ఒడిదుడుకులకు లోనైన మార్కెట్ చివరికి మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ నామమాత్రంగా ఒక పాయింట్ నష్టపోయి 28,443 వద్ద నిలవగా, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 8,538 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,929 లాభపడితే, 1,082 మాత్రమే నష్టపోయాయి. 200 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకడం విశేషం. సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, భెల్ 2.5%పైగా పురోగమించగా, డాక్టర్ రెడ్డీస్ అదే స్థాయిలో డీలాపడింది. -
స్టాక్ మార్కెట్ విలువ 100 లక్షల కోట్లకు చేరువలో..
న్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ)లో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 100 లక్షల కోట్ల మార్క్‌కు చేరువైంది. బీఎస్ఈలో మొత్తం 5,508 షేర్లు లిస్ట్‌కాగా, 1,330 కంపెనీలు సస్పెండ్ అయ్యాయి. దీంతో 4,178 కంపెనీల షేర్లు మాత్రమే ట్రేడింగ్‌కు అర్హత కలిగి ఉన్నాయి. బుధవారం(5న) ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 97,13,196 కోట్లను తాకింది. రూ.100 లక్షల కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం రూ. 2.86 లక్షల కోట్ల దూరంలో నిలిచింది. ఇక డాలర్లలో చూస్తే(ఒక డాలరుకు రూ. 61.41 లెక్క ప్రకారం) 1.58 ట్రిలియన్లుగా ఉంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సంస్కరణలు వేగవంతం చేయడం వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) సైతం జనవరి మొదలు ఇప్పటివరకూ స్టాక్స్‌లో రూ. 82,226 కోట్లను(13.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వెరసి బీఎస్ఈ ప్రధానసూచీ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 6,745 పాయింట్లు(32 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని సైతం అధిరోహించింది. సెన్సెక్స్‌లోని పలు బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. టీసీఎస్ అయితే ఏకంగా రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి దేశీయ కంపెనీగా కొత్త రికార్డును సృష్టించింది. -
కార్పొరేట్ల మార్కెట్ క్యాప్‌లో టాటా టాప్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల జోరును అద్దంపడుతూ ఓవైపు సెన్సెక్స్ 23,000 పాయింట్లకు చేరువవుతుంటే... మరోపక్క 17 దేశీ కార్పొరేట్ గ్రూపులు అంతకుమించిన జోష్‌తో రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)ను అందుకోవడం విశేషం. టాటా గ్రూప్ రూ. 7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో నిలిచింది. వెరసి ఈ జాబితాలోని 17 బిజినెస్ గ్రూపుల మొత్తం విలువ రూ. 35 లక్షల కోట్లకు చేరడం మరో విశేషం! అంటే ఇది దేశీ స్టాక్ మార్కెట్ల విలువ రూ. 75 లక్షల కోట్లలో దాదాపు సగం! రెండు గ్రూపులు కలిపినా తక్కువే జాబితాలో 2,3 స్థానాల్లో నిలిచిన హెచ్డీఎఫ్సీ గ్రూప్, ముకేశ్ అంబానీ ఆర్ఐఎల్ గ్రూప్‌ల సంయుక్త విలువ కంటే టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ అధికం కావడం చెప్పుకోదగ్గ అంశం. 30కుపైగా లిస్టెడ్ కంపెనీలున్న టాటా గ్రూప్‌నకు ప్రధానంగా టీసీఎస్ నుంచి రూ. 4.3 లక్షల కోట్లు సమకూరాయి. కాగా, రూ. 3.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో హెచ్డీఎఫ్సీ గ్రూప్ రెండో స్థానంలో నిలవగా, రూ. 3.07 లక్షల కోట్ల విలువతో ఆర్ఐఎల్ 3వ స్థానాన్ని పొందింది. ఈ బాటలో ఐటీసీ(రూ. 2.7 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్(రూ. 1.8 లక్షల కోట్లు)తోపాటు, వేదాంతా, భారతీ, ఆదిత్య బిర్లా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్, అదానీ, హెచ్‌సీఎల్, బజాజ్ గ్రూప్ సైతం లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ జాబితాలో నిలిచాయి.