న్యూఢిల్లీ: ఆర్థిక సేవల రంగంలోని ప్రముఖ కార్పొరేట్ గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ... మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. టాటా గ్రూపు తర్వాత రూ.10 లక్షల కోట్ల మార్కును చేరుకున్న రెండో గ్రూపు హెచ్‌డీఎఫ్‌సీ కావడం గమనార్హం. బ్యాంకింగ్, గృహరుణాలు, బీమా ఉత్పత్తులు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా భిన్న రకాల ఆర్థిక సేవల్లో హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
గ్రూపులో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్, గృహ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్నాయి. మరో సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఐపీవో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఒక్క కంపెనీ మార్కెట్ విలువ రూ.30,000 కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు టీసీఎస్, ఆర్‌ఐఎల్ తర్వాత దేశంలోనే అత్యంత విలువైన మూడో కంపెనీ.
హెచ్‌డీఎఫ్‌సీ నాలుగు దశాబ్దాలుగా గృహ రుణ వ్యాపార కార్యకలాపాల్లో ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 25 ఏళ్లుగా పనిచేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ 20 ఏళ్ల నుంచి, గృహ్ ఫైనాన్స్ 30 ఏళ్ల నుంచి వ్యాపారంలో ఉన్నవే. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు కంపెనీలన్నింటికీ మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్. ఇందులో 76 శాతం వాటాదారులు ఎఫ్‌ఐఐలే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment