స్టాక్ మార్కెట్ విలువ 100 లక్షల కోట్లకు చేరువలో..
న్యూఢిల్లీ: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ)లో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 100 లక్షల కోట్ల మార్క్‌కు చేరువైంది. బీఎస్‌ఈలో మొత్తం 5,508 షేర్లు లిస్ట్‌కాగా, 1,330 కంపెనీలు సస్పెండ్ అయ్యాయి. దీంతో 4,178 కంపెనీల షేర్లు మాత్రమే ట్రేడింగ్‌కు అర్హత కలిగి ఉన్నాయి. బుధవారం(5న) ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 97,13,196 కోట్లను తాకింది. రూ.100 లక్షల కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి కేవలం రూ. 2.86 లక్షల కోట్ల దూరంలో నిలిచింది.
ఇక డాలర్లలో చూస్తే(ఒక డాలరుకు రూ. 61.41 లెక్క ప్రకారం) 1.58 ట్రిలియన్లుగా ఉంది.
ఈ ఏడాది మొదట్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సంస్కరణలు వేగవంతం చేయడం వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) సైతం జనవరి మొదలు ఇప్పటివరకూ స్టాక్స్‌లో రూ. 82,226 కోట్లను(13.7 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు.
వెరసి బీఎస్‌ఈ ప్రధానసూచీ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 6,745 పాయింట్లు(32 శాతం) దూసుకెళ్లింది. ఈ బాటలో సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని సైతం అధిరోహించింది. సెన్సెక్స్‌లోని పలు బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. టీసీఎస్ అయితే ఏకంగా రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి దేశీయ కంపెనీగా కొత్త రికార్డును సృష్టించింది.