తీవ్ర ఒడిదుడుకులు..!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో ఈ వారం తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు గురువారం గడువు ముగింపు దీనికి ప్రధాన కారణమని చెప్పారు. నవంబర్ కాంట్రాక్టుల నుంచి స్టాక్స్, ఇండెక్స్‌ల లాట్ సైజులు భారీగా పెరుగుతుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతుందనేది వారి అభిప్రాయం. ఇక భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీ రెండో త్రైమాసికం(క్యూ2) ఫలితాలు మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు.
డెరివేటివ్ విభాగంలో ట్రేడర్ల రోలోవర్లు, బిహార్ ఎన్నికల నేపథ్యంలో నెలకొనే కొత్త పరిణామాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, వేదాంత, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, లుపిన్ తదితర దిగ్గజాలు కూడా ఈ వారం ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.
అక్టోబర్ సిరీస్ ఎఫ్‌ఏఅండ్‌వో కాంట్రాక్టుల ముగింపు కారణంగా మార్కెట్ కొంత కుదుపులకు గురయ్యే అవకాశం ఉందని.. ఫలితాలను వెల్లడిస్తున్న, ప్రకటించిన స్టాక్స్ ఆధారితంగా కదలికలు ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలో మార్పులు కూడా మన మార్కెట్ కదలికలను నిర్దేశించనున్నట్లు విజయ్ సింఘానియా చెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలు(నవంబర్ 8న) వెల్లడయ్యేవరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అనుసరించే అవకాశాలున్నాయని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ పేర్కొన్నారు. కాగా, గత శుక్ర వారం చైనా కేంద్ర బ్యాంక్ మరో విడత పాలసీ వడ్డీరేటును పావు శాతం, రిజర్వ్ రిక్వైర్‌మెంట్ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్)ను అర శాతం తగ్గించిన నేపథ్యంలో దీని ప్రభావం ఈ సోమవారం ప్రపంచ మార్కెట్లపై ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
మరోపక్క, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారం(27, 28 తేదీల్లో) పాలసీ సమీక్షను నిర్వహించనుంది. వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడ్ తీసుకోబోయే నిర్ణయం కూడా ప్రపంచ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికాలో మందకొడిగానే ఉన్న జాబ్ మార్కెట్ తదితర అంశాల నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపును మరోసారి ఫెడ్ వాయిదా వేయొచ్చని.. ఇక ఈ ఏడాది దీనిపై నిర్ణయం ఉండకపోవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
గత వారం మార్కెట్...
వరుసగా నాలుగో వారం కూడా దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే కొనసాగింది. గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగసి 27,471 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 57 పాయింట్ల లాభంతో 8,295 వద్ద స్ధిరపడింది.
ఆరు నెలల గరిష్టానికి ఎఫ్‌పీఐల పెట్టుబడులు
ఆర్‌బీఐ అనూహ్యంగా అర శాతం రెపో రేటును తగ్గించడం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) నిధుల ప్రవాహం మళ్లీ జోరందుకుంటోంది. అక్టోబర్‌లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ.19,000 కోట్లను వెచ్చించారు. ఇది 6 నెలల గరిష్ట స్థాయి(మార్చిలో రూ.20,723 కోట్ల నికర పెట్టుబడులు) కావడం గమనార్హం. స్టాక్స్‌లో రూ.5,545 కోట్లు, డెట్ మార్కెట్లో(బాండ్స్) రూ.13,838 కోట్లను అక్టోబర్‌లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎఫ్‌పీఐలు రూ.23,000 కోట్ల పెట్టుబడులను(డెట్, ఈక్విటీ) నికరంగా వెనక్కి తీసుకోవడం తెలిసిందే.