
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేయడంతోపాటు నిత్యావసరాలు సరసమైన ధరలకు లభించేలా పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 7 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీల్లో పలువురు అధికారులకు చోటు కల్పించారు. సంబంధిత విభాగాలు, అంశాల వారీగా సమన్వయ కమిటీలకు బాధ్యతలు కేటాయించాలని పేర్కొన్నారు.
► నిత్యావసర వస్తువుల లభ్యత, అవసరాలను అంచనా వేసి కమిటీలు తగిన చర్యలు తీసుకోవాలి.
► 1902 స్పందన కాల్ సెంటర్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చే సమస్యలను సమన్వయంతో వెంటనే పరిష్కరించాలి. రోజువారీ నివేదికను స్టేట్ కంట్రోల్ రూమ్‌కు సమర్పించాలి.
► ఇదే తరహాలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లాస్థాయి కంట్రోల్‌రూమ్‌ల సమన్వయంతో పని చేయాలి.
► తయారీ రంగం, రవాణా, సర్వీసులు తదితర సమస్యలపై ప్రజలు రాష్ట్ర, జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు.
కమిటీలు ఇవే:
► రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ
► తయారీ, నిత్యావసర వస్తువుల రాష్ట్రస్థాయి కమిటీ
► నిత్యావసర వస్తువుల సరఫరా రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీ,
► రాష్ట్ర స్థాయి రవాణా సమన్వయ కమిటీ
► స్థానిక సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీ
► ఎన్‌జీవో, స్వచ్ఛంద సంస్థల పరిష్కారానికి సమన్వయ కమిటీ
► మీడియా సమన్వయ కమిటీ
జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్..
అదేవిధంగా జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో వేర్వేరుగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తూ సీఎస్ నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ పటిష్ట అమలుతోపాటు నిత్యావసర వస్తువులను సామాన్య ప్రజానీకానికి సాధారణ ధరలకు అందుబాటులో ఉంచేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలు చర్యలు చేపడతాయి.