సాక్షి, అమరావతి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షల సామర్థ్యం పెరిగిందని.. హాట్‌స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో ర్యాపిడ్ టెస్టింగ్ నిర్వహిస్తామని సీఎస్ నీలంసాహ్ని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవసరం మేరకు గ్రీన్‌జోన్లలో కూడా ర్యాపిడ్ టెస్టింగ్‌లు చేస్తామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని.. హోం క్వారంటైన్ ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ వివరించారు. కేంద్రం ఇచ్చే సూచనలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు.
(కరోనా కాలంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం)
సరిహద్దులను మూసివేశాం..
జిల్లాల్లోని కంటైన్మెంట్ క్లస్టర్లలో మాత్రమే కేంద్రం నిబంధనలు పెట్టిందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మండలాలవారీగానే కంటైన్మెంట్ జోన్లను గుర్తించిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని జిల్లాల విస్తీర్ణం ఎక్కువగా ఉందని.. అందువలనే మండలాల వారీగా జోన్లను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై ప్రతిరోజూ సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దులను కూడా మూసివేశామని తెలిపారు. ప్రజా రవాణాను కూడా నియంత్రించామన్నారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్ల ద్వారా సమగ్ర కుటుంబసర్వే నిర్వహిస్తున్నామని సీఎస్ పేర్కొన్నారు.
(కరోనాను జయించి.. క్షేమంగా ఇంటికి..)
వైద్యులకు అందుబాటులో పీపీఈ, ఎన్95 మాస్కులు..
‘‘వైద్యుల కోసం పీపీఈ, ఎన్95 మాస్కులను అందుబాటులో ఉంచాం. కరోనా కట్టడికి కుటుంబసర్వే చాలా బాగా ఉపయోగపడింది. కుటుంబసర్వే ద్వారా 32వేల మందిని గుర్తించాం... వారందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ అందిస్తున్నాం. పేదలకు రేషన్‌తోపాటు రూ.వెయ్యి కూడా అందజేశాం. రేషన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. రేషన్ సరుకులు ఇచ్చే షాపుల సంఖ్యను కూడా పెంచామని’’ సీఎస్ వివరించారు.
వాలంటీర్ల వ్యవస్థ బాగా ఉపయోగపడింది..
గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా ఏఎన్‌ఎంలు, వాలంటీర్లు.. ప్రజలకు మరింత చేరువయ్యారని సీఎస్ పేర్కొన్నారు. కుటుంబ సర్వే నిర్వహించడంలో ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడిందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రైతుబజార్లను వికేంద్రీకరించామని.. నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇప్పటికే ‘1902’ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని.. జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ధరలను నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకున్నామన్నారు. వ్యవసాయ రంగంపై ప్రతిరోజూ సీఎం జగన్ సమీక్ష చేస్తున్నారని.. వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ వ్యవసాయ పనులు చేసుకునేలా ఆదేశాలిచ్చామన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు చర్యలు..
‘‘వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర వాణిజ్య శాఖతో పాటు ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడుతున్నాం. క్వారంటైన్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించాం. కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాటులో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని’’ సీఎస్ తెలిపారు.
లాక్‌డౌన్ మరింత కఠినతరం..
కరోనా కట్టడికి కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యాధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని సీఎస్ పేర్కొన్నారు. వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేశామని.. సడలింపు తర్వాత కూడా పట్టణ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని సీఎస్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని.. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ టెలీ మెడిసిన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని సీఎస్ నీలంసాహ్ని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment