
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో పరీక్షలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ కరోనా పరీక్షలు చేయడంతో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రోజుకు 3వేల వరకూ టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ చేసిన సూచనలు..
► వైరస్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి.
► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక, సెకండరీ సర్వైలైన్స్ బృందాల ద్వారా కరోనా టెస్ట్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
► మరణాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
► వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించేలా చూడాలని చెప్పారు.
► కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ వివరించారు.