
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేశారు. కోవిడ్–19 నియంత్రణ చర్యలపై ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. గత నెలరోజులకుపైగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తూ కరోనా వైరస్ నియంత్రణకు విశేష కృషిచేస్తున్నందుకు అన్ని రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► ఈనెల 20న గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర మినహాయింపులిచ్చాం. ఆయాచోట్ల పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి.
► అక్కడ పరిశ్రమలు, తయారీ యూనిట్లు, ఎస్‌ఈజడ్‌లు, ఎక్స్‌పోర్ట్ జోన్లు వంటివి పనిచేసేలా.. కార్మికులు భౌతిక దూరం పాటించేలా చూడాలి.
► చిన్నచిన్న దుకాణాలన్నీ యథావిధిగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించాం.
► వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర హోంశాఖ ఆదేశాలకు లోబడి ఆయా రాష్ట్రాలతో మాట్లాడి వారిని సొంత రాష్ట్రాలకు పంపించే విషయంపై నిర్ణయం తీసుకోవాలి.
► విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చే అంశంపై కేంద్రం ప్రయత్నిస్తోంది.
సర్కారుపై ప్రజల్లో నమ్మకం
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు మూసి ఉన్నందున తగిన ఎగుమతులకు అవకాశాల్లేక ఉద్యానవన, ఆక్వా తదితర రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆమె రాజీవ్ గౌబ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్.జవహర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజి రవిశంకర్ అయ్యన్నార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్‌కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ఐజి ఎన్‌ఫోర్స్‌మెంట్ వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment