మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ | Rajiv Gauba Comments About Lockdown | Sakshi
Sakshi News home page

మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

Published Mon, Apr 6 2020 4:09 AM | Last Updated on Mon, Apr 6 2020 4:09 AM

Rajiv Gauba Comments About Lockdown - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ను జయించేందుకు వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సూచించారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలుచేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. కోవిడ్‌–19 కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన విధానంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం రాజీవ్‌ గౌబ ఢిల్లీ నుండి  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు పనిచేసేలా చూడాలని సీఎస్‌లకు సూచించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

► ఆహారం, మందులకు ఎక్కడా ఇబ్బందులు రాకూడదు.
► లాక్‌డౌన్, కంటైన్మెంట్‌ విధానాలను పటిష్టంగా అమలుచేయాలి.
► ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి.
లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేయడం ద్వారా కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టాలి.
► జిల్లాల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా సీఎస్‌లు, కలెక్టర్లు చూడాలి.
► రాష్ట్రాలు, జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ వనరులన్నింటినీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని అవసరమైన సమయంలో అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా వినియోగించుకోవాలి.
► హైరిస్క్‌ ఉన్న వారంతా విధిగా క్వారంటైన్‌ కేంద్రాలు లేదా ఐసోలేషన్‌లో ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. 
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె. భాస్కర్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement