ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ నగర్ మార్కెట్ వద్ద కొనుగోలుదారుల రద్దీ
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే అనూహ్యంగా కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర ధరలు పెంచిన వ్యాపారులు మంగళవారం కాస్త వెనక్కి తగ్గారు. చాలాచోట్ల కూరగాయల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వ్యాపారులు ధరలు తగ్గించారు. సోమవారంతో పోలిస్తే జనం సైతం మార్కెట్‌లకు తక్కువగా రావడం, డిమాండ్‌కు మించి కూరగాయల సరఫరా ఉండటంతో ధరలు అదుపులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం, మలక్‌పేట, మెహిదీపట్నం వంటి 12 రైతుబజార్లలో ధరలు తగ్గాయి. టమాటా కిలో రూ. 20 నుంచి రూ. 30 మధ్య విక్రయించగా, పచ్చిమిర్చి కిలో రూ. 40–50, బంగాళదుంప రూ. 30–40, ఉల్లిగడ్డ రూ. 30–40 మధ్య ధరలకు విక్రయించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు చాలాచోట్ల వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఉగాది పండుగ పచ్చడికి అవసరమయ్యే మామిడాకులు, వేప పువ్వు, బెల్లాలను మాత్రం వ్యాపారులు అధిక ధరలకు అమ్మారు. వేపపువ్వు చిన్నకట్టను సైతం రూ. 20–30కి విక్రయించగా, మామిడాకుల కొమ్మను ఏకంగా రూ. 50 వరకు విక్రయించారు. సూపర్‌మార్కెట్లలోనూ సోమవారంతో పోలిస్తే రద్దీ తక్కువగా కనిపించింది. ధరలపై నియంత్రణ ఉంటుందని, జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో ధరల నియంత్రణపై నిఘా వేసి ఉంచామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పూల రైతు విలాపం...
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్
పూల రైతులకు కష్టాలను మిగిల్చింది. గుడిమల్కాపూర్ మార్కెట్ రెండ్రోజులుగా మూతపడగా.. మంగళవారం సైతం మార్కెట్‌ను పోలీసులు బలవంతంగా మూసివేయించారు. ఉగాది పండుగ కోసం అమ్మకాలు ఉంటాయని చాలామంది రైతులు బంతి, చామంతి, జర్మనీ పూలతో మార్కెట్‌కు ఉదయమే చేరుకున్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. చాలామంది రైతులు సాగు చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఈనెల 31 వరకు పూల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు మార్కెట్ వర్తక సంఘం చైర్మన్
బి.మహిపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment