చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలు
గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం
అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా, మత్స్యకార భరోసా రాదు
విద్యా దీవెన, వసతి దీవెన కనిపించడం లేదు
రోగమొస్తే ఆదుకునే దిక్కులేదు.. ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు.. ఇంటికొచ్చే మందులూ ఆగిపోయె
తలుపు తట్టి పింఛన్ ఇచ్చే వలంటీర్ వ్యవస్థకూ మంగళం
పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్సూ మిస్సు
ఆదాయం పెరగక, ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం
మరోవైపు అటకెక్కిన అభివృద్ధి.. గ్రామ సీమలన్నీ కళా విహీనం
స్కూళ్లలో ఆగిపోయిన నాడు–నేడు పనులు
ఒక్క పనీ జరక్క ఊసురోమంటున్న సచివాలయాలు
అన్నదాతలకు చేయూత ఇవ్వలేని దుస్థితిలో ఆర్బీకేలు
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివన్నట్లుగా మారిన ధరలు
ఊరారా ఇదే దుస్థితి.. అందరి నోటా ఇదే మాట
చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలు
పండగంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటికొచ్చిన బంధువులకు కానుకలు, చుట్టుపక్కలోళ్లకు పెట్టుబతలు.. గ్రామస్తులంతా తలో చేయి వేసి నిర్వహించే సామూహిక సంబరాలు.. ఇలా కోలాహలం కళ్లకు కట్టేది. ఈ ఏడాది ఏ ఊళ్లో అయినా ఇలాంటి సందడి కనిపిస్తుందేమోనని దివిటీ పట్టుకుని వెతికినా కనిపించని దుస్థితి. అన్ని వర్గాల ప్రజల్లో అదో నిర్లిప్తత, నైరాశ్యం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై ‘సాక్షి’ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించాయి. ‘ఆనందంగా పండుగ చేసుకోవాలని ఉంది. అయితే అందుకు చేతిలో నాలుగు డబ్బులుంటేనే కదయ్యా..’ అని అంటున్నారు ఊరూరా జనం.
పండగ అంటే గత ఐదేళ్లలోనే అని గుర్తు చేసుకున్నారు. ‘ఊళ్లో పరిస్థితి బాగోలేదు.. ఇంట్లోనూ అందుకు భిన్నంగా లేదు’ అని పెద్దలు వాపోయారు. ‘స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ ఆగిపోయాయి.. సచివాలయాల్లో పనులు కావడం లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి.. ఇంటికొచ్చి పని చేసి పెట్టే వలంటీర్లు కనిపించడం లేదు.. నెలకు రెండుసార్లొచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారో తెలీదు.. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా లేదు.. మత్స్యకార భరోసా లేదు.. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇళ్లకు పంపించేస్తున్నారు.. పరిస్థితి ఇట్లా ఉంటే ఏంది పండుగ చేసుకునేది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో ఊరారా ఇదే దుస్థితి కనిపించింది. అందరి నోటా ఇదే మాట వినిపించింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళ తప్పింది.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: ‘అవసరానికి అందివచ్చే డబ్బులు.. కష్టకాలంలో ఆదుకునే పథకాలు.. వెరసి ప్రతి రోజూ పండుగ రోజే’ అన్నట్లుగా గత ప్రభుత్వ పాలనలో ప్రతి పేద ఇంటిలో సంతోషం కనిపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ‘అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. కష్టకాలంలో పట్టించుకునే నాథుడే కరువు.. పెద్ద పండుగ వస్తున్నా కన్పించని సందడి’ అన్నట్లు ప్రతి ఇల్లూ మారిపోయింది. రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సందడి ఈ ఏడాది ఊళ్లల్లో కనిపించడం లేదు.
గడిచిన ఏడు నెలల్లో సంక్షేమాభివృద్ధి ఆగిపోవడమే ఇందుకు కారణం. దేశంలోనే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ‘నవరత్నాలు’ ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల గడపకు చేరడం లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ (డీబీటీ పద్దతి) చేస్తూ గత సర్కారు అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనీసం కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ సైతం అమలు చేయక పోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఆ ఐదేళ్లు మహోజ్వల వైభవం
గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, చెప్పిన నెలలో చెప్పిన సమయానికి ఆయా వర్గాలకు ఆర్థిక లబ్ధిని వారి ఖాతాలకు (డీబీటీ పద్దతి) నేరుగా జమ చేసేవారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బులు ఉండేలా చేశారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. విద్యార్థులు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లతోపాటు పొదుపు మహిళలు, రైతులకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు.
కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఆర్థిక లబ్ధిని కలిగించే సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించడంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఆర్థిక ఇక్కట్లను అధిగమించి కొనుగోలు శక్తి కొనసాగేలా చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సామగ్రి, పిండి వంటలకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునేలా చేశారు. ప్రధానంగా విద్య, వైద్యం పరంగా దిగుల్లేకుండా చేశారు.
సచివాలయ–వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే పనులన్నీ జరిగేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మార్పుల దిశగా గత 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ అడుగులు పడలేదు. అలాంటి మార్పులను.. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో సాకారం చేసింది. తద్వారా ఉన్నత వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా పండుగలను ఆనందంగా జరుపుకొనేలా ఆర్థిక ఊతం ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లలో కోత పెట్టేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో పాటు మరో పథకాన్ని ప్రజలకు అందివ్వలేదు. ఏడు నెలలైనా ఒక్క పథకాన్ని కూడా అందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు చేతికి వచ్చేవని, ఆ డబ్బులతో కావాల్సినవి కొనుక్కుని ఇంటిల్లిపాది పెద్ద పండుగను గొప్పగా జరుపుకొనేవాళ్లమని గతం గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు.
కూటమి సర్కారు రాకతో తమ పరిస్థితి తారుమారైందని వాపోతున్నారు. గత సర్కారే కొనసాగి ఉంటే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు పథకాల ద్వారా దాదాపు 2.63 కోట్ల మందికి రూ.20,102 కోట్లçకుపైగా లబ్ధి చేకూరేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు అందక పోవడంతో పండుగ పూట పస్తులు తప్పడం లేదని పేదలు ఆవేదన చెందుతున్నారు.
అసంపూర్తి గదిలో పాఠాలు
ఇది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో దాదాపు 220 మంది చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తరగతి గదుల నిర్మాణానికి రూ.1,93,88,511 మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలోనే రూ.75,42,872 ఖర్చు చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గదులకు కిటికీలు, డోర్లు, టైల్స్ అమర్చాల్సి ఉంది. బయటి వైపు ప్లాస్టింగ్ చేయాలి. గదుల కొరత కారణంగా అసంపూర్తిగా ఉన్న నూతన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులకు ఎండ తగలకుండా ఉండేందుకు యూరియా సంచులు అడ్డు పెట్టారు.
బంధువులను పిలవలేకపోతున్నాం
గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల ఫీజు కట్టే వాళ్లం. ఈసారి ‘తల్లికి వందనం’ సాయం అందలేదు. పంటలో వచ్చిన డబ్బులన్నీ స్కూల్ ఫీజులకే చాలడం లేదు. పండుగ వచ్చినా మా ఇంట్లో ఎలాంటి సంబరాలూ చేసుకోలేని స్థితి. మా చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా సంక్రాంతి సందడి కనిపించడం లేదు. చాలా మందితో ఫోన్‌లో మాట్లాడితే ఇదే సమాధానం చెబుతున్నారు. బంధువులను కూడా ఇళ్లకు పిలవలేని పరిస్థితి నెలకొంది.
– రైతు గోవిందప్ప, సంతేబిదనూరు, హిందూపురం
ఇప్పుడు ఆ సందడి లేదు
విజయనగరం పట్టణం మూడు రాష్ట్రాలకు వాణిజ్య కేంద్రం. గత ఐదు సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే ఉమ్మడి విజయనగరం ప్రజల నుంచి మార్కెట్‌లో కొనుగోలుదారులు పెరిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ వ్యాపారం తగ్గింది. ముఖ్యంగా బడుగు మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. గతంలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఉండేవి. అటు హోల్‌సేల్ ఇటు రిటైల్ వ్యాపారాలతో పట్టణం కళకళలాడేది. ఇప్పుడా సందడి కనిపించడం లేదు.
– కాపుగంటి ప్రకాష్, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్
కొనుగోలు శక్తి తగ్గింది
గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో కరోనా వచ్చినప్పటికీ సంక్రాంతంటే మార్కెట్ కళకళలాడేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తాయి. ఇప్పుడు ఏ పథకాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లు లేక ఈ సంక్రాంతి కళ తప్పింది.
– షేక్ చాంద్‌బాషా, మండీ మర్చంట్, పాత మార్కెట్, కడప
సంక్రాంతి పండగలానే లేదు
ఈ ఏడాది సంక్రాంతి కళ మా గ్రామంలో కనిపించడం లేదు. వ్యాపారాలు పడిపోయాయి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. రొటేషన్ లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. గ్రామంలో మా కిరాణా షాపు గత ఏడాది వరకు రోజుకు రూ.15 వేలు అమ్మకం జరిగేది. ప్రస్తుతం రూ.5 వేలు కూడా అమ్మకం జరగడం లేదు.
– లావుడియా శ్రీనివాసరావు, సర్పంచ్, కనిమెర్ల, ఎన్టీఆర్ జిల్లా
సంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాం
పశువులు, వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గత ఆర్నెల్లుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనీసం సంక్రాంతి కానుకైనా ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. అది కూడా లేకుండా చేశారు. పెరిగిన పప్పులు, నూనెల ధరలు చూస్తుంటే పండుగకు పిండి వంటలు మానుకోవడమే ఉత్తమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది మాలాంటోళ్లందరూ ఇలానే అంటున్నారు.
– ఎస్.భవాని, కొత్తవలస, విజయనగరం జిల్లా
పంట మునిగినా పైసా ఇవ్వలేదు.. ఇంక పండగెక్కడ?
వైఎస్సార్ హయాంలో కాలనీ ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి అమ్మ ఒడి పడేది. పదో తరగతి పూర్తయింది. మాకు 30 సెంట్లు భూమి ఉంది. గత ఏడాది వరకు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం ఇచ్చేది. రైతులం పంటలు పండించుకునేవాళ్లం. ఈసారి ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పోసప్పో చేసి పంట వేశాం. మొన్న అక్టోబర్‌లో వర్షాలకు పొలం మునిగిపోయింది. పంట నష్టం ఇస్తామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాను. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంక మా బతుకులకు పండగొకటి. అన్నిటికీ ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.
– పల్లా రాము, రైతు, టి.నగరపాలెం, భీమిలి నియోజకవర్గం
గత ప్రభుత్వంలోనే ఎంతో మేలు
ప్రస్తుతం ఏ కుటుంబమూ సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఓ వైపు ఆర్థిక సమస్య, మరోవైపు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఉంటే పిండి వంటలు ఎలా వండుకుంటాం? సంతోషంగా పండగ ఎలా జరుపుకుంటాం? గత ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మా బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేది. ఖర్చులకు, అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
– సీహెచ్ భారతి, గృహిణి, నెల్లూరు
చేతిలో లెక్కేదీ?
వైఎస్సార్ జిల్లా అనిమెల గ్రామంలో సుమారు 2,500 జనాభా ఉంది. ఈ గ్రామంలో గత ఐదేళ్లు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కళ తప్పింది. పండుగ ఆనందం ఏ ఒక్క ఇంట్లోనూ కనిపించలేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు లేకపోగా, వచ్చిన అరకొర దిగుబడికి ఆశించిన ధరలు లేక రైతులు ఆవేదనతో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఒక్క గ్రామానికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.1.8 కోట్లు లభించింది. ఈ లెక్కన ప్రజల చేతుల్లో డబ్బు ఏ రీతిన రొటేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని గ్రామస్తులు అన్నారు.
ఏం ఉందని జరుపుకోవాలి?
బాపట్ల జిల్లా రాజుబంగారుపాలెంలో 3,200 కుటుంబాలుంటున్నాయి. ఈ ఊళ్లో దాదాపు అందరూ సామాన్యులే. ‘ఏమ్మా.. పండుగ ఎలా చేసుకుంటున్నారు..’అన్న ప్రశ్నకు రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కూరగాయలమ్ముకునే మహిళలు.. ఇలా అందరూ కూడబలుక్కున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చేయూత రాలేదు. ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు.. అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు.
ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పిల్లోళ్లకు బట్టలు కొందామంటే డబ్బులు లేక ఉప్పుకయ్యల్లో పనికెళుతున్నానని జొన్నలపావని కన్నీటి పర్యంతమైంది. జగనన్న లాగా నెలనెలా డబ్బులు ఇచ్చివుంటే అందరం సంతోషంగా పండుగ చేసుకునేవారమని సరస్వతి పేర్కొంది. పింఛన్లు తీసేశారని కొందరు, రైతు భరోసా ఇవ్వలేదని ఇంకొందరు వాపోయారు. ఇలాంటి కష్టాల్లో పండుగ ఎలా జరుపుకోగలమని ఊరు ఊరంతా ఎదురు ప్రశ్నిస్తోంది.
సాయం అందితే కదా..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బులు లేకుండా పండుగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2,600 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరు ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుపానులతో పంటలు నష్టపోయినా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్‌మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మద్యం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామంలోకి వచ్చేయడంతో రోజంతా కష్టపడ్డ రెక్కల కష్టంలో సగం సొమ్ము మద్యానికే వెచ్చించడం కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని మహిళలు అంటున్నారు. నాడు వలంటీరు వ్యవస్థతో ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment