స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో..
శివారులో అచ్చతెలుగు సంక్రాతి సంబరాలు
పండుగ సందడికి సరికొత్త విడిది కేంద్రాలు
ఇటీవలి కాలంలో పెరిగిన ఫామ్ హౌస్ కల్చర్
కొత్త తరహా వేడుకలకు నగరవాసుల ఆసక్తి
సకల సదుపాయాలతో అద్దెకు ఫామ్‌హౌస్‌లు
సంక్రాంతి తెలుగుదనానికి, స్వచ్ఛమైన పల్లె వాతావరణానికీ ప్రతీక. అందమైన రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. భోగిమంటలు.. స్వచ్ఛమైన పిండివంటలు.. హరిదాసు పాటలు.. గంగిరెద్దుల విన్యాసాలతో వెల్లివిరిసే ఆనందోత్సాహాలతో సందడిగా జరుపుకుంటాం.. ఇలాంటి అందమైన వేడుకకు పల్లెను మించిన వేదిక మరొకటి ఉండదు. అందుకే నగరవాసులు ప్రతి పండుగకూ పల్లెకు పయనమవుతారు. సంవత్సరం పొడవునా చేసుకొనే రొటీన్ వేడుకలకు ఇది భిన్నం.. అయితే ఇటీవలి కాలంలో.. పల్లెకు వెళ్లలేని వారు ఫామ్‌హౌస్‌లలో సంక్రాంతి సంబరాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తున్నారు. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు సంక్రాంతి సందడికి వేదికవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో కలిసి సంక్రాంతి విడిది కేంద్రాల్లో సరదాగా సేదదీరుతున్నారు. దీంతో నగర శివారులోని సిద్ధిపేట్, గండిపేట్, చేవెళ్ల, వికారాబాద్, కడ్తాల్ వంటి ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లలో సంక్రాంతి సందడి నెలకొంది..ఆ విశేషాలు..
సంక్రాంతి అంటే సరదగా సాగే వేడుక.. బంధువులు.. పిండి వంటలు.. ఆటలు.. పాటలు.. ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి.. ఓ రకంగా సంక్రాంతి సంబరాలు అంటే అంబరాన్ని తాకేలా ఉంటాయి.. దీంతో ఒత్తి జీవనానికి అలవాటుపడిన నగరవాసులు కనీసం రెండు మూడు రోజులు నగరానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.. అందుకే ‘భోగి రోజు కంటే ముందే ఫామ్‌హౌస్‌కు చేరేవిధంగా ప్లాన్ చేసుకున్నాం’.. అని ఉప్పల్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. తెల్లవారు జామున నిద్రలేచి భోగిమంటలు వేసుకొని, అందమైన ముగ్గుల నడుమ వేడుకలు చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ తరహా వేడుకలు జరుపుకునే వారికోసం నగర శివారులోని ఫామ్ హౌస్‌లు వేదికలుగా
మారుతున్నాయి.
సకల సదుపాయాలు..
రోజుకు కనిష్టంగా రూ.3000 నుంచి గరిష్టంగా రూ.10,000 వరకూ అద్దెకు ఫామ్‌హౌస్‌లు లభిస్తున్నాయి. ఇందులో స్విమ్మింగ్ పూల్స్, క్రీడా ప్రాంగణాలు, కేర్‌టేకర్ వంటి హై సెక్యూరిటీతో సకల సదుపాయాలూ కలి్పస్తున్నారు. దీంతో ఇటీవల పల్లె వాతావరణాన్ని ఇష్టపడే వారు ఈ ఫామ్ హౌస్‌ల కేంద్రంగా వేడకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగి
యజమానులు అద్దెలు పెంచడం గమనార్హం.
పతంగుల పండుగ..
సంక్రాంతి పండుగ రైతులకు ఎంత ముఖ్యమైనదో.. పిల్లలకూ అంతే ప్రధానమైనది. కాంక్రీట్ అరణ్యంలా మారిన నగరంలో పతంగులు ఎగరేయడం ఓ సవాల్. దీంతో విశాలమైన మైదానాలు, భవనాలపై నుంచి పతంగులు ఎగరేస్తారు. ఇది పూర్తి స్థాయి ఆనందాన్ని కలిగించదు.. అందుకే ఫామ్ హౌస్‌లలో పతంగుల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాలమైన పొలాలు, పచి్చక బయళ్లలో పిల్లలు గంటలతరబడి పతంగులతో కాలం గుడుపుతారు.. ‘పిల్లలకు ప్రకృతి, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి గురించి తెలియజెప్పాలి. అందుకే ఫామ్ హౌస్‌లను ఎంపిక చేసుకున్నాం’ అని ఈసీఐఎల్‌కు చెందిన చంద్రశేఖర్ చెబుతున్నారు.
‘రియల్’ సంస్థల ప్రత్యేక ఏర్పాట్లు..
నగవాసుల ఆసక్తి, అభిరుచిని గుర్తించిన ‘రియల్’ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వెంచర్‌లో కొంత స్థలాన్ని పండుగ వాతావరణం ఉట్టిపడేవిధంగా డిజైన్ చేసి అద్దెకు ఇస్తున్నారు. ఇటు వెంచర్‌లకు ప్రచారం.. అటు ఆదాయం రెండూ సమకూరుతున్నాయి. తద్వారా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లలో ఉండే నగరవాసులు ఫామ్‌హౌస్ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment