ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉన్నా..ఈ పండగకి మాత్రం తమ సొంతూళ్లకి చేరి చేసుకునే గొప్ప పండుగా సంక్రాంతి. అందర్నీ ఒక చోటకు చేర్చే పండుగ. ఎంత వ్యయప్రయాసలు కోర్చి అయినా.. ఈ పండగకి సోంతూరికి వెళ్తేనే ఆనందం. అలాంటి ఈ పండుగ విశిష్టత ఏంటి, దేశమంతా ఏఏ పేర్లతో ఈ పండగను జరుపుకుంటుంది తదితరాల గురించి చూద్దామా..!.
సంక్రాంతి పండగా ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ జరుపుకునే సంబరం. ఈ పండుగ నాటికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటారు. పురాణ కథనం ప్రకారం తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. అది సరిగ్గా మకర సంక్రాంతి పండుగ రోజునే. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14న(మంగళవారం) మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు.
ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో హాయిగా ఉంటామని విశ్వసిస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు. అంత మహిమాన్వితమైన మకర సంక్రాంతిని దేశమంతా ఏఏ పేర్లతో ఎలా జరుపుకుంటుందో చూద్దామా..!.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతిని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. అక్కడ పెద్దల పేరు చెప్పి భోజనం పెట్టడం లేదా ఏవైన దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. వరి దుబ్బులు తీసుకొచ్చి పక్షులకు ఆహారం పెట్టడం వంటివి చేస్తారు.
తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. వాళ్లు ఈ పండగను వ్యవసాయ ఉత్పాదకత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.
కేరళలో మకర సంక్రాంతి పేరు మకరవిళక్కు. ఈ రోజున శబరిమల ఆలయం దగ్గర ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ప్రజలు దానిని సందర్శిస్తారు
కర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.
పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘి నాడు శ్రీ ముక్తసర్ సాహిబ్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఈ రోజున నృత్యం చేసి ఆడి, పాడతారు. ఈ రోజున కిచిడి, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది.
గుజరాత్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్య కాలంగా జరుపుకుంటారు. ఆ రోజున గాలిపటాల పండుగ జరుగుతుంది. అలాగే ఉండియు, చిక్కీ వంటకాలు తింటారు.
హిమాచల్ ఫ్రదేశ్‌లో ఈ పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం. కొత్త నెల ప్రారంభం… మాఘమాసం కూడా నేటినుంచే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రారంభ సూచికగా ఈ పండుగ చేసుకుంటారు.
ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతంలో మకర సంక్రాంతి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున నేతిలో వేయించి తీసిన పిండి పదార్ధాలను కాకులకు ఆహారంగా పెడతారు.
ఒడిషాలో ప్రజలు మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు. కొబ్బరి వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను తయారు చేస్తారు ముఖ్యంగా కోణార్కో లోని సూర్యదేవాలయానికి ఈరోజు భక్తులు పోటెత్తుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడిదర్శనం చేసుకుంటారు.
పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ప్రజలు గంగానది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడాజరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు ఖర్జూర పండును ఎక్కువగ ఉపయోగిస్తారు. కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం ఖర్జూరాలతో తయరు చేసిన ఖీర్ వంటివి ఆరగిస్తారు.,
డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఈరోజున ప్రజలు శివుడిని ఆరాధిస్తారు.
బీహార్,జార్ఖండ్లలో ఈ రోజున ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగిపోతారు. సాయంత్రం వేళ ప్రత్యేక ఖిచిడీని తయారు చేసి పాపడ్, నెయ్యి, కూరగాయలతో చేసిన వంటకాన్ని బంధువులు స్నేహితులతో కలిసి సామూహికంగా ఆరగిస్తారు.
ఇతర దేశాల్లో..
నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ ఈ పండగ కనిపిస్తుంది. అక్కడ ప్రజలు నది -సముద్రం కలిసే సంగమ ప్రదేశంలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారట. అలాగే పతంగులు, తీపి వంటలు ప్రధానంగా ఉంటాయట.
(చదవండి: Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment