భగ్గుమంటున్న వంటనూనెల ధరలు
అన్నిరకాల నూనెలపై రూ.12 నుంచి రూ.15 పెంపు
సాక్షి, హైదరాబాద్: వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంతకూ తగ్గమంటున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పిండివంటల నూనెలు మండిపోతున్నాయి. ఇక రోజూ వంటల్లో సరిపడా నూనె వాడేందుకే ఒకటికి, రెండుసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రోజుకు వందల టన్నుల వంటనూనెల అమ్మకాలు జరుగుతున్నాయి.
గృహ అవసరాలకే కాకుండా హోటల్స్, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధరకాల వంట నూనెలు భారీగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి పండుగ రావడంతో నగరంలో వంట నూనెల డిమాండ్ మూడింతలు ఎక్కువైంది. దీంతో నూనె ధరలు ఆమాంతం పెరిగాయి. హోల్‌సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై ధర రూ.5 నుంచి రూ.8 పెరిగింది. రిటైల్, బహిరంగ మార్కెట్‌లో ప్రతి లీటరు నూనెపై రూ.12 నుంచి రూ.15 పెరిగింది.
అన్ని రకాల నూనెల ధరలు భగ్గుమంటున్నాయి
పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్, వేరుశనగ, రైస్‌బ్రాన్.. ఇలా అన్ని రకాల నూనెల ధరలు భారీగా పెరిగాయి. వంట నూనెలకు సంబంధించి హోల్‌సేల్ ధరలు, రిటైల్ మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లో పామాయిల్ కిలో ధర రూ.100 నుంచి రూ.105కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో రూ.115కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.130 నుంచి రూ.140 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.145–150 పలుకుతోంది. కిలో వేరుశనగ నూనె ధర నెల క్రితం రూ.150 ఉండగా, ఇప్పుడు రూ.165కు పెరిగింది. వీటితోపాటు రైస్‌బ్రాన్ ఆయిల్ ధర రూ.140 నుంచి రూ.150 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది.
ఈ స్థాయిలో వంటనూనెల ధరల మంటకు కారణం నూనెలపై దిగుమతి సుంకం పెరగడమేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే ముడి ఆయిల్‌పై సుంకాన్ని 5–10 శాతం నుంచి ఏకంగా 45 శాతానికి ప్రభుత్వం పెంచిందని, అందుకే ధరలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. వంటనూనెల ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వంటనూనెలపై దిగుమతి సుంకం పెరగడం కొందరు వ్యాపారులకు వరంగా మారింది. పాత స్టాక్‌ను గోడౌన్లలో దాచేసి ధరలు పెంచి అమ్ముతున్నారు.
ఇదీ చదవండి: వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే
Comments
Please login to add a commentAdd a comment