పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
రాత్రి 10 గంటల వరకు శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంబరాన్నంటిన కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు ప్రయాణమైన లక్షలాది వాహనాలు వెరసి వాయు కాలుష్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. పండగకు వరుస సెలవులు తోడవడంతో హైదరాబాద్ నుంచి సుమారు 30 శాతం మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. దీంతో నగరంలో నడిచే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంతా భావించారు.
స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ఊహించారు. అయితే అవన్నీ ఊహలేనని చెబుతూ వాయు నాణ్యత ఇండెక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 151గా నమోదు కాగా, 11న మరోమారు 150ని తాకింది. వార్షిక సరాసరి 136గా నమోదైంది. 2021లో వార్షిక ఏక్యూఐ 149గా నమోదు అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు లెక్క. 100 వరకు మోస్తరుగా ఉన్నట్లు. 100– 150 కి చేరితే మాత్రం నాణ్యత లోపించిందని లెక్క.
ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యత 122 నుంచి 151 మధ్య నమోదవుతోంది. ఏటా డిసెంబరు, జనవరి నెలల్లోనే గాలి నాణ్యత ఇలా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది జులైలో 53గా గాలి నాణ్యత ఉండగా, ఆరు నెలల్లోనే సుమారుగా రెండున్నర రెట్లు క్షీణించింది. ఈ వాయువులు పీలిస్తే ఆరోగ్యం చెడిపోతుందని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మోత మోగిపోతోంది..
నగరంలో వాయు కాలుష్యానికి తోడు శబ్ద కాలుష్యం కూడా మోత మోగిస్తోంది. ఉదయం నుంచే సాధారణానికి మించి శబ్దాలు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో శబ్ద కాలుష్యం 55 డెసిబెల్స్ కంటే తక్కువ ఉండాలి. హైదరాబాద్ నగరంలో సుమారుగా 80 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. రాత్రి పూట ప్రధాన రహదారులపై ప్రైవేటు వాహనాలు పెద్ద శబ్దాలతో హారన్‌లు మోగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment