సమష్టి జీవనానికి ప్రతీకగా పిండి వంటల తయారీ
ఇరుగుపొరుగుతో కలిసి వంటల్లో నిమగ్నం
సత్తుపల్లిటౌన్: తెలుగురాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అయితే, సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులతో పాటు పిండి వంటలూ గుర్తుకొస్తాయి. నోరూరించే పిండి వంటల కోసం చిన్నాపెద్ద ఎదురుచూస్తుంటారు. ఖరీఫ్ పంటల డబ్బు చేతికి వచ్చేవేళ పండుగ సందడి మొదలవుతుంది. వారం ముందు నుంచే ఇంటింటా పిండి వంటలు చేస్తూ మహిళలు, యువతులు బిజీబీజీ అయ్యారు. అరిసెలు, గారెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు, బూందీ లడ్డు, గవ్వలు, సున్నుండలు, చక్రాలు, కారపుపూస ఇలా రకరకాల పిండి వంటల తయారీతో వీధులు ఘుమఘుమలాడుతున్నాయి. ఆధునిక యువతకు వారి అమ్మలు దగ్గరుండి పిండి వంటలు తయారు చేయటం నేర్పిస్తున్నారు.
ఇరుగుపొరుగు వారితో కలిసి..
సంక్రాంతి పండుగకు వారం, పదిరోజుల ముందు నుంచే పల్లె, పట్టణంలోని ఇళ్లల్లో పిండి వంటల తయారీ మొదలవుతుంది. వీటిని ఒక్కరే చేయటం సాధ్యం కాదు కాబట్టి ఆడపడుచులంతా ఇరుగుపొరుగు బంధువుల సాయంతో పిండి వంటలు చేస్తారు. ఒకరోజు పక్కింట్లో.. మరోరోజు ఎదురింట్లో కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు తయారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది సమష్టి జీవన విధానానికి తార్కాణంగా నిలుస్తోంది.
సంబురంగా చేసుకుంటాం..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరం ఒకచోట కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు చేసుకుంటాం. వీధిలో ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లి పిండి వంటలు చేస్తాం. రకరకాల పిండి వంటలు చేసుకోవటం ఈ పండుగ ప్రత్యేకం. – తోట జానకి, సత్తుపల్లి
ఇది అరిసెల పండుగ
ఏటా సంక్రాంతి పండుగకి అరిసెలు ఎక్కువగా చేస్తుంటాం. పంటలు చేతికి వస్తాయి కాబట్టి అన్ని రకాల వంటలు చేసుకునే వీలు ఉంటుంది. ఈ పిండి వంటలలో పోషకాలు ఉంటాయి. లడ్డూలు, చక్రాలు వంటివి చేసుకుంటాం. – సుబ్బలక్ష్మా, సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment