సింగపూర్ సంక్రాంతి శోభ | Sankranti Festival 2024 Celebrations In Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ సంక్రాంతి శోభ

Published Sun, Jan 28 2024 5:21 PM | Last Updated on Sun, Jan 28 2024 5:26 PM

Sankranti Festival 2024 Celebrations In Singapore - Sakshi

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో “సింగపూర్ సంక్రాంతి శోభ” కార్యక్రమం ఆద్యంతం అంతర్జాల వేదికపై అలరించింది. సింగపూర్ వాస్తవ్యులైన పెద్దలు పిల్లలు కలిసి  సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో ఆనందంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ పాల్గొని సంస్థ యొక్క కార్యక్రమాలను కృషిని అభినందించారు. 

వారు మాట్లాడుతూ “సంక్రాంతి ప్రకృతి పండుగ అని, స్నేహ సంబంధాలు పెంచి ఆత్మీయతను పంచే పండుగ అని, విదేశాలలో ఈ తరం పిల్లలను కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కలుపుకుంటూ మన సంప్రదాయక విలువలను వారికి తెలియజేసే విధంగా వివిధ పండుగల వేడుకలను నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది అని తెలియజేశారు. సింగపూర్ లో సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షణ చేసే  దిశగా ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలను చెయ్యాలని దీవించారు. 

ఆత్మీయ అతిథులుగా సీనియర్ బిజెపి నాయకులు, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు శ్రీ వామరాజు సత్యమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొని, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్లో తెలుగు సంస్కృతి కోసం చేస్తున్న సేవలను అభినందించారు. అలాగే సింగపూర్ లో సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రతిభ ఉన్నవారు ఉన్నారని వారందరినీ ఈ వేదిక ముఖంగా కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ కు చెందిన ‘స్వర లయ ఆర్ట్స్’ విద్యార్థులచే ప్రదర్శింపబడిన గొబ్బిళ్ళ పాటలు, సంప్రదాయబద్ధమైన ఆటలు, ముగ్గులు, భోగి పళ్ళు, హరిదాసు వేషధారణ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. 

సింగపూర్ లో ఉండే తెలుగు ప్రజలలో మంచి కళా సృజన రసాత్మకత నిండి ఉన్నాయని, వారి యొక్క ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఇటువంటి వేదికలు మరిన్ని ఏర్పాటు చేసే దిశగా తమ సంస్థ కృషి చేస్తుందని తమకు బండారు దత్తాత్రేయ గారు మరియు ప్రముఖులైన ఇతర ఆత్మీయ అతిథులు అందించిన అభినందనలు ఆశీస్సులు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ, అతిథులకు కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

రాధిక మంగిపూడి సభా నిర్వహణలో,  విద్యాధరి కాపవరపు, సౌభాగ్య లక్ష్మీ తంగిరాల, షర్మిల చిత్రాడ, శేషు కుమారి యడవల్లి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, కృష్ణ కాంతి, తదితరగాయనీమణులు చక్కటి సంక్రాంతి పాటలను ఆలపించారు. అలాగే సింగపూర్ సాహితీ ప్రతిభను కూడా నిరూపిస్తూ అపర్ణ గాడేపల్లి, సుబ్బు వి పాలకుర్తి, ఫణీష్ ఆత్మూరి, స్వాతి జంగా, రోజా రమణి ఓరుగంటి, కవిత కుందుర్తి, శైలజ శశి ఇందుర్తి,  శాంతి తెల్లదేవరపల్లి తదితరులు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ తెలుగు పద్యాలు, సంక్రాంతి కవితలు రచించి వినిపించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భారద్వాజ్, సుధాకర్ జొన్నాదులు, భాస్కర్ ఊలపల్లి, రాంబాబు పాతూరి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు

రాధాకృష్ణ గణేశ్న యొక్క సాంకేతిక సారధ్యంలో ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement