గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో డైరెక్టర్ శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని కొనియాడారు. రామ్ చరణ్ ఆర్టిస్ట్ కంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే ఇందులో కనపడుతుందని ప్రశంసలు కురిపించారు. నా నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్నీ కూడా గేమ్ ఛేంజర్‌లో ఉంటాయన్నారు. తమన్ బీజీఎం ఏఆర్ రెహమాన్‌ను తలపించేలా చేశారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి నటనను శంకర్ ప్రశంసించారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథతోనే గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించినట్లు శంకర్ తెలిపారు. అయితే ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ, డైరెక్టర్ శంకర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అదేంటో చూసేద్దాం.
గేమ్ ఛేంజర్‌లో రాజీవ్ కనకాల అద్భుతమైన నటనతో మెప్పించారని శంకర్ అన్నారు. అదే సమయంలో సుమ కనకాల మధ్యలో వచ్చిన ఆయన నా భర్త సార్ అని అన్నారు. దీనికి బదులిస్తూ ఆ విషయం నాకు తెలుసు.. మిమ్మల్ని చాలా ఏళ్లుగా చూస్తున్నాని అన్నారు. స్టేజ్‌పై వేల మంది ఆడియన్స్ ఉన్నప్పటికీ అందరినీ కంట్రోల్ చేసే సత్తా మీకుందని సుమను పొగిడారు. కానీ నా భర్త మీద మాత్రమే కంట్రోల్ లేదు సార్ సుమ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ ఫన్నీ సంభాషణతో అక్కడున్నవారంతా ముసిముసి నవ్వులు చిందించారు.
కాగా.. శంకర్- రామ్ చరణ్ డైరెక్షన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment