
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్‌లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్‌తో, దిల్‌రాజ్ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది' అని అన్నారు.