టెక్నాలజీ విస్తృతం అవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్‌నే బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశారు.
తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాలర్‌తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ తన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. లక్ష డెబిట్ అయ్యాయని దయానిధి మారన్ ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దయానిధి మారన్‌కు అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ అందుకున్న తర్వాత, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 డెబిట్ అయింది.
తాను బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. దయానిధి మారన్ బ్యాంకు వివరాలు అడిగారు. కానీ ఆయన ఆ వివరాలేవీ ఆ వ్యక్తితో పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఎంపీ దయానిధి మారన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న అక్కడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)లో కేసు నమోదు చేశారు.
మాజీ టెలికాం మంత్రి..
దయనిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికం మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. నోకియా, మోటరోలా, ఎరిక్సన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, డెల్‌తో సహా అనేక బహుళజాతి టెలికాం కంపెనీలు దేశంలో యూనిట్లను ఏర్పాటు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment