
చెన్నై సినిమా: మాయోన్ చిత్ర ప్రచారానికి వినూత్నంగా(విష్ణుమూర్తి శేష శయనం ప్రతిభతో) రథయాత్రను ప్రారంభించారు. నటుడు సిబిరాజ్, తాన్యా జంటగా నటించిన చిత్రం మాయోన్. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథను అందించి నిర్మించిన చిత్రం ఇది. ఎన్.కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్ర ప్రచార యాత్ర విశేషపూజ, హోమాలతో ఆదివారం ప్రారంభమైంది. ఇక రామాపురంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార రథయాత్రను రాష్ట్రవ్యాప్తంగా 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. దైవం, సైన్స్, విగ్రహాల స్మగ్లింగ్, గుప్తనిధులవేట వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. డావిన్సీ కోడ్ వంటి చిత్రాలు తనకు చాలా ఇష్టమని, ఆ తరహా చిత్రాల్లో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నటుడు సిబిరాజ్ పేర్కొన్నారు.