కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.
తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
అయితే ఈ ఏడాది కమర్షియల్‌గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్‌కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment