ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : చల్లగాలి కోసం ఇంటి బయట మంచి మీద కూర్చుని ఉన్న తండ్రి, ఇద్దరు కుమార్తెలను ప్రహరీ గోడ ప్రాణం తీసింది. ఓ ఖాళీ స్థలం కోసం నిబంధనలకు విరుద్ధంగా మరీ ఎత్తులో నిర్మించి ఉన్న ప్రహరీ గోడ నేలమట్టం కావడంతో పీక్కన్ కరణైలో విషాదం చోటు చేసుకుంది. చెన్నై శివారులోని తాంబరం సమీపంలోని పీక్కన్ కరణై ముత్తమిళ్ వీధి శ్రీనివాస నగర్‌కు చెందిన రాజాంగం(60) పెయింటర్. ఆయనకు కుమార్తెలు కళ(40), సుమిత్ర(32) ఉన్నారు. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఉక్కపోత కారణంగా ఇంట్లో ఉన్న మంచాన్ని తీసుకొచ్చి బయట వేసుకున్నారు. మంచం మీద కూర్చుని తండ్రి, కుమార్తెలు మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా ఆ ఇంటికి అనుకుని ఉన్న ఎత్తయిన ప్రహరీ గోడ నేలమట్టం అయ్యింది. క్షణాల్లో ఆ ప్రహరీ గోడ నేలమట్టం కావడం, ఆ శిథిలాల కింద తండ్రి, కుమార్తెలు చిక్కుకున్నారు. ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు.
పక్కింట్లో ఉన్న వాళ్లతో కలిసి శిథిలాల కింద పడి ఉన్న వారిని రక్షించే యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 వర్గాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ముగ్గుర్ని చికిత్స నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో రాజంగం మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమిత్ర సోమవారం వేకువజామున చికిత్స ఫలించక మరణించింది. ఆమె మరణించిన కాసేపటికి కళ కూడా విగత జీవిగా మారింది. ప్రహరీ గోడ నేలమట్టం కావడంతో తండ్రి, కుమార్తెలు మరణించిన సమాచారం ఆ పరిసర వాసుల్ని విషాదంలోకి నెట్టింది.
అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఖాళీస్థలంలో ఎత్తయిన ప్రహరీ నిర్మించి ఉండటంతోనే అది నేల మట్టమైనట్టు విచారణలో తేలింది. ఖాళీగా ఉన్న స్థలాలను కాపాడుకునేందుకు ఆయా స్థలాల యజమానాలు, అనేక చోట్ల ఎత్తయిన ప్రహరీ గోడలను పీక్కన్ కరణ్‌లో నిర్మించి వదిలి పెట్టి ఉన్నారని, వాటిని పర్యవేక్షించే వాళ్లు లేక అవి శిథిలావస్థకు చేరుతున్నాయని, తరచూ ›ప్రమాదాలు తప్పడం లేదని ఆ పరిసర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment