న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా దక్షిణాది రాష్ట్రాలు ఇంకా గండం నుంచి గట్టెక్కలేదు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఇంకా లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో నాలుగు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనార్హం
ఇక్కడే అధికం
ఏప్రిల్, మేలలో దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గడగడలాడించింది, ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తోంది. అయితే దక్షిణ భారత దేశం ఇంకా కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడలేదు. జూన్ 1 నుంచి 14 వరకు గణాంకాలు పరిశీలిస్తే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే.
తమిళనాడు ఫస్ట్
కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రపై అత్యధిక ప్రభావం చూపించింది. వేవ్ మొదలైనప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు అవుతూ వచ్చాయి. తాజాగా ఆ స్థానం తమిళనాడుకు మారింది. గత రెండు వారాల్లో తమిళనాడులో 2.43 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 1.10 లక్షల కొత్త కేసులు వచ్చాయి.
ఢిల్లీ సేఫ్
సెకండ్ వేవ్ తీవ్రతకు ఢిల్లీ చిగురుటాకుల వణికిపోయింది. ఆక్సిజన్ లభించక వందల మంది చనిపోయారు. అయితే కఠిన లాక్‌డౌన్ తర్వాత అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మే ద్వితీయార్థంలో 20.14 వేల కేసులు నమోదు అయితే జూన్ ప్రథమార్థంలో ఈ సంఖ్య 4,407కు పడిపోయింది. గోవాలో సైతం కేసుల సంఖ్య 15,555 నుంచి 5,226కి తగ్గింది.
ఈ రెండు వారాలు కీలకం
లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్న ఐదు రాష్ట్రాలకు రాబోయే రెండు వారాలు ఎంతో కీలకం. సడలింపులు ఇస్తూనే కఠిన లాక్‌డౌన్/ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment