తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు 51 మంది మరణించారు. అయితే, ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. క్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు.
ఈ సంఘటనపై కోలీవుడ్ టాప్ హీరోలు భగ్గుమంటున్నారు. ఈ సంఘటన గురించి దళపతి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేయడమే కాకుండా.. బాధితులను పరామర్శించాడు. 'గతేడాది కూడా ఇలాంటి ఘటనతో 22మందికి పైగా చనిపోయారు. అయినా, ప్రభుత్వంలో ఉన్న నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ విధానాలు మార్చుకోలేదు. ఇప్పటికైనా మద్యం విషయంలో ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి.
ఈ మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి. వారి మరణ వార్త వినగానే నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మద్యం విషయంలో ప్రభుత్వ తీరును తప్పకుండా మార్పుచేయాలి. ఇలాంటి ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైన తమిళనాడు ప్రభుత్వం కఠన నిర్ణయం తీసుకోవాలి.' అని విజయ్ కోరారు.
ఈ ఘటనను ఖండిస్తూ హీరో సూర్య ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్పకాలిక పరిష్కారాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కల్తీ మద్యం, అక్రమ విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.
తమిళనాడు పరిపాలన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు మద్యానికి బానిసలుగా కాకుండా ప్రభుత్వం చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మద్యం విషయంలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలి.' అని సూర్య కోరారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలని సూర్య ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment