
సాక్షి ప్రతినిధి,చెన్నై: శ్రీలంక ప్రభుత్వ చెరలో ఉన్న తమిళనాడు జాలర్ల విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సముద్రతీర రక్షణ దళాలు 29 మంది జాలర్లను, వారికి చెందిన 79 మరపడవలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు.
ఈనెల 7వ తేదీన మూడు మరపడవల్లో చేపలవేటకు వెళ్లిన 11 మంది తమిళ జాలర్లను అరెస్ట్ చేసి శ్రీలంకలోని మయిలాట్టి కోస్ట్‌గార్డ్ ప్రదేశానికి తరలించారని, గత కొన్ని వారాలుగా శ్రీలంక కోస్ట్‌గార్డు అధికారాలు భారత్‌కు చెందిన అమాయక మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇటీవలకాలంలో మూడుసార్లు జాలర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శ్రీలంక అధికారులు అసంబద్ధ వైఖరి వల్ల జాలర్ల జీవనాధారం దెబ్బతినడమే కాదు, వారి ప్రాణాలకు, హక్కులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ద్వారా చర్చలు జరిపి మత్స్యకారుల విముక్తికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా, జాలర్ల అరెస్ట్‌కు నిరసనగా రామేశ్వరంలో మాత్రమే కొసాగుతున్న మత్స్యకారుల సమ్మె మరింత విస్తృతం కానుంది. రామనాథపురం జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఆందోళనకు దిగనున్నట్లు మత్యకార సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తమ కు ఈపరిస్థితి ఏర్పడిందని ఆరోపించాయి.
Comments
Please login to add a commentAdd a comment