చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
కారణం ఏమిటంటే..: లోకేష్ కనగరాజ్
'విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు.
కరుంగాలి మాల అంటే..
కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది.
ఆన్‌లైన్‌లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు.
శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే
కరుంగలి మాలను కోలీవుడ నుంచి శివకార్తికేయన్, ధనుష్ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. 'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment