
హిందీ వ్యతిరేక టీషర్టులతో సెలబ్రిటీలు
రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్యమం బయలుదేరింది. తద్వారా తమిళాభిమాన పార్టీలు, బీజేపీ మధ్య సమరానికి దారితీసింది. కొందరు సినీ సెలబ్రిటీలు, యువత హిందీ తెలియదు పోరా అంటూ టీషర్టులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అదే సమయంలో హిందీ నేర్చుకుంటే తమిళం కాదు, డీఎంకే గల్లంతు అంటూ బీజేపీ యువత ఎదురు దాడికి దిగింది.
సాక్షి, చెన్నై: ఆది నుంచి హిందీ, సంస్కృతానికి తమిళనాడు వ్యతిరేకమన్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పాలకులు హిందీని బలవంతంగా రుద్దే యత్నం చేస్తే ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడింది. దీంతో కేంద్రం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఇతర భాషల వారు రాష్ట్రంలో ఉన్నా విద్య, ఉపాధి రంగాల్లో తమిళులకే పెద్ద పీట. మిగిలిన భాషల వారు అల్పసంఖ్యాక వర్గాలే. హిందీ, సంస్కృతాన్ని తమిళుల దారిదాపుల్లోకి రానివ్వరు. బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే పోరాటాలు బయలుదేరుతాయి. (ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!)
ఇటీవల కూడా హిందీ, సంస్కృతం విషయంగా కేంద్రం పలు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలతో పోరాటాలు భగ్గుమన్నాయి. తాజాగా కేంద్రం త్రి భాషా విధానంతో హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నట్టు తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చట్టాన్ని పాలకులే కాదు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఉద్యమం బయలుదేరడం గమనార్హం.
సమరంలో సెలబ్రిటీలు
హిందీకి వ్యతిరేకంగా సినీ సెలబ్రిటీలు యువన్ శంకర్‌రాజ, ఐశ్వర్య రాజేష్, శాంతను తదితరులు పరో క్షంగా, ప్రత్యక్షంగా హిందీ వ్యతిరేక నినాదాలతో టీ షర్టులు ధరించి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యారు. ‘హిందీ తెలియదు పోరా, నేను తమిళం మాట్లాడే భారతీయుడిని’ అన్న నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. డీఎంకే యువజన నేత, నటుడు ఉదయ నిధి సారథ్యంలో టీ షర్టుల హిందీ వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో కొందరు యువకులు హిందీ వ్యతిరేక నినాద టీషర్టులు ధరించి సామాజి క మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
దీంతో హిందీకి వ్యతిరేకంగా కనిమొళి నేతృత్వంలో సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమం మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై కనిమొళిని ప్రశ్నించగా యువత, కొందరు సెలబ్రిటీలు హిందీకి వ్యతిరేకంగా తమదైన శైలిలో స్పందిస్తున్నారని తెలి పారు. చట్టం బయటకు వచ్చే సమయంలో ఈ ఆగ్రహం ఉప్పెనలా ఎగసి పడుతుందన్నారు. బీజేపీ యువత ఎదురు దాడిలో నిమగ్నమైంది. ‘హిందీ నేర్చుకున్నంత మాత్రాన.. తమిళం గల్లంతు కాదని, డీఎంకే అడ్రస్సే గల్లంతు’ అంటూ టీషర్టులతో ఎదురుదాడి సాగిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment