నటుడు రజనీకాంత్ పార్టీ స్థాపన పనుల్లో భాగంగా మక్కల్ మన్రం పెద్దలు ఢిల్లీలో తిష్టవేశారు. ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పేరును నమోదు చేసినట్లు సమాచారం.
సాక్షి, చెన్నై : రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ 2017 డిసెంబర్‌లో చెప్పారు. ఈ డిసెంబర్ 31న పార్టీ స్థాపనపై కీలక ప్రకటన చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన, ఏప్రిల్ లేదా మేలో వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని అందరూ భావిస్తున్నారు. పార్టీ స్థాపనపై మక్కల్ మన్రం నిర్వాహకులతో రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటి వద్ద శుక్రవారం మరోసారి సమాలోచనలు జరిపారు. ప్రధాన సమన్వయకర్త అర్జున్‌మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్, మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులు సుధాకర్, మన్రం మాజీ అధ్యక్షులు సత్యనారాయణన్ పాల్గొన్నారు. పార్టీ పేరును రిజిస్టర్ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద మక్కల్ మన్రం అగ్రనేతలు శుక్రవారం బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి న్యాయవాదుల నుంచి సలహా లు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తా రు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని అంచనా.
నేడు రజనీ జన్మదినం..
ఈనెలాఖరులో పార్టీని ప్రకటించబోతున్న తరుణంలో శనివారం నాటి రజనీకాంత్ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో అభిమానులు సందడి చేయనున్నారు. రజనీకాంత్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, ఎన్నికల్లో ఘనవిజయం సా«ధించాలని ప్రార్థిస్తూ మక్కల్ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. మక్కల్ మన్రం చెన్నై పశ్చిమం శాఖ తరఫున జిల్లా కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ వెస్ట్‌మాంబళంలోని శంకరమఠంలో శుక్రవారం సాయంత్రం గోపూజ జరిపారు. అశోక్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, మహిళా విభాగం అధ్వర్యంలో రంగరాజపురంలో సంక్షేమ కార్యక్రమాలు, సైదాపేటలో అన్నదానం శనివారం నిర్వహిస్తారు.
కాంగ్రెస్ ఎంపీ ఎద్దేవా..
పార్టీని స్థాపించి సినిమా షూటింగులకు వెళ్లే ఒకే ఒక రాజకీయనేత దేశమొత్తం మీద రజనీ మాత్రమేనని అంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఎద్దేవా చేశారు. పార్టీ రాజకీయాలను ఎవరైనా ఎంతో సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలోకి దిగి పాటుపడాల్సి ఉంటుంది. అయితే పార్టీని స్థాపించిన తరువాత “అన్నాత్త’ అనే చిత్రం షూటింగ్ కోసం 40 రోజులపాటు రజనీ వెళ్లిపోతున్నట్లు వెలువడిన సమాచారం విచిత్రంగా ఉందని ఆమె అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment