![Sunil Chhetri Calls Justice For Tamilnadu Father And Son Lockup Death - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/29/death.jpg.webp?itok=nSzD_Efy)
న్యూఢిల్లీ: తమిళనాడులో పోలీసుల కస్టడీలో మరణించిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌లకు న్యాయం జరగాలని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి మరణానికి న్యాయం జరగాలంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా సునీల్ ఛెత్రి ట్వీట్ చేస్తూ.. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. తిరిగి వారి ప్రాణాలను ఏదీ తిరిగి ఇవ్వలేదు. కనీసం వారి మరణానికైనా న్యాయం జరగాలి. అది ఒక బలమైన ఉదాహరణగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ ‘‘రక్షకులే అణచివేతదారులుగా మారినప్పుడు’’ అంటూ ట్వీట్ చేశారు. (‘సెల్’ కోసమే దాష్టీకమా?)
తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సాత్తాన్‌కులానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌లు సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో విధించిన లాక్‌డౌన్‌లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు అడిగిన సెల్‌ఫోన్ ఇవ్వలేదనే జయరాజ్, బెనిక్స్‌లను అరెస్టు చేశారని, ఆ కక్ష్యతోనే లాఠితో అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని దుకాణదారులంతా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!)
Comments
Please login to add a commentAdd a comment