తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నిర్మాతల మండలి తాజాగా పేర్కొంది. తమిళ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 'నిర్మాతల సంఘం తరపున ఇప్పటికే పలు సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్‌తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది. దీనిని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని వారు తెలిపారు.
నిర్మాతల సమస్యలకు పరిష్కారం కనుగొనే వరకు నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు వారు నిర్ణయించాం. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది.
తమిళ నిర్మాతల ప్రధాన డిమాండ్స్
అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.
ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.
అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.
నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment