సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఉత్తర్వులతో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలతోపాటు అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. కేసులు తక్కువగా ఉన్నపుడు కఠినంగా వ్యవహరించి.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ వైరస్‌ను తక్కువ అంచనా వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు ప్రభుత్వం భయంగొలిపే ప్రకటనలు చేసింది. వైరస్ సోకినా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పి మార్చి 24వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకరికి పాజిటివ్‌గా తేలితే ఆ వీధి మొత్తం సీలువేసి రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వీధిలోని వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. కేసు బయటపడిన ఐదు కిలోమీటర్ల పరిధిలో అందరికీ వైద్యపరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించారు. (కోయంబేడు కొంపముంచిందా?)
వైరస్ లక్షణాలున్నవారు ఆసుపత్రిలో 14 రోజులు, హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉండాలని చెప్పారు. పాజిటివ్ కేసులు పెరిగే కొద్దీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మారుస్తూ వస్తోంది. పాజిటివ్ కేసు బయటపడిన వారి ఇంటిని మాత్రమే కట్టడి చేస్తామని..వీధులకు సీలు వేయబోమని తెలిపింది. కుటుంబ సభ్యులకు మాత్రమే పరీక్షలు చేస్తామని చెబుతోంది. ఆసుపత్రుల్లో అడ్మిటైన వారిని మూడు నాలుగు రోజుల్లో ఇంటికి పంపివేస్తున్నారు. అనారోగ్యానికి గురైనా వైరస్‌లక్షణాలు లేనిపక్షంలో ఇంటివద్దనే భౌతికదూరం పాటిస్తూ చికిత్సపొందాలని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా ఉండేవి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న వేళ సడలింపులు పెరిగిపోతున్నాయి. ఇలా వైరస్ విలయతాండవం ఆడుతున్న వేళ పాత ఉత్తర్వుల్లో మార్పులు, లాక్‌డౌన్ సడలింపులతో అంతా ఆయోమయంలో పడిపోతున్నారు.
తమిళనాడులో పదిరోజుల్లో వైరస్ కేసులు మూడింతలయ్యాయి. మొదటి నుంచి చెన్నైలో ఎక్కువ కేసులు నమోదవుతుండగా కోయంబేడు మార్కెట్ ప్రభావంతో చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం చెన్నై తరువాత ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. చెన్నైలో మంగళవారం నాటికి 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురం 299 కేసులు నమోదయ్యాయి. చెన్నైలో కరోనావైరస్ కేసు బయటపడిన పరిసర ప్రాంతాల్లో రీసైకిల్ మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేసినట్లు కరోనావైరస్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు 5 వేల పడకలతో కూడిన 39 ప్రత్యేక కరోనా కేంద్రాలను సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
అధికారులకు కరోనా కాటు
చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే హెల్త్‌ఇన్‌స్పెక్టర్‌కు సోమవారం కరోనా సోకింది. అలాగే చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు వైరస్ బారిన పడడంతో పోలీసు బాధితుల సంఖ్య 190కి చేరుకుంది.
కరోనా అప్‌డేట్స్
మంగళవారం నమోదైన కేసులు 716
మొత్తం పాజిటివ్ కేసులు 8718
చెన్నైలో కేసుల సంఖ్య 518
చెన్నైలో మొత్తం కేసులు 4882
మరణాలు 8 (మొత్తం 61)
Comments
Please login to add a commentAdd a comment