
ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : తనను వివాహం చేసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్నిగుట్టు చప్పడు కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఈ వ్యవహారమంతా బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన ఓ యువతి(17) మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి అదే రోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. అలాగే జాఫర్ షా(26) అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉన్నట్లు, ఇంతకుముందు చాలా సార్లు తన కూతురిని వేధింపులకు గురిచేశాడని యువతి తండ్రి పోలీసులకు తెలియజేశాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాఫర్ గురించి విచారించగా ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అనంతరం అతడి మొబైల్ లొకేషన్‌ను తనిఖీ చేయగా తమిళనాడులోని వలపరాయ్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసులు అక్కడికి చేరుకోగా నిందితుడి కారులో యువతి కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు జాఫర్‌ను విచారించగా.. యువతిని పొడిచి చంపి మృతదేహన్ని ఊరి చివర పడేసినట్లు అంగీకరించాడు. కాగా సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా తేయాకు తోట పక్కన యువతి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే యువతి ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనట్లు ఆనవాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తమిళనాడు పోలీసులు తెలిపారు.