కరోనా: ‘మహా’ భయం!  | Coronavirus Positive Cases Increasing Due Maharashtra People In Tamilnadu | Sakshi
Sakshi News home page

కరోనా: ‘మహా’ భయం! 

Published Sat, May 23 2020 7:16 AM | Last Updated on Sat, May 23 2020 11:42 AM

Coronavirus Positive Cases Increasing Due Maharashtra People In Tamilnadu - Sakshi

మహారాష్ట్ర నుంచి వస్తున్న వారి రూపంలో రాష్ట్రంలో  కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రెడ్‌జోన్ల పరిధిలో లేని జిల్లాల మీద ఈ ప్రభావం పడుతుండడంతో కేసులు  అమాంతంగా పెరుగుతున్నాయి. ఏం చేయాలో  తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు తొలుత ఢిల్లీ జమాత్‌కు వెళ్లిన వారి రూపంలో ప్రవేశించాయి. ఆ సమాచారం జనాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సమయంలో కోయంబేడు మార్కెట్‌ రూపంలో కరనో కోరలు చాచింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు నుంచి విల్లుపురం, కడలూరు వరకు కోయంబేడు రూపంలో కేసులు అమాంతంగా పెరిగాయి. పక్క రాష్ట్రాలను సైతం ఈ మార్కెట్‌ వదలి పెట్టలేదు. రోజుకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు వందల సంఖ్యలో పెరగడంలో ఈ మార్కెట్‌ కీలక పాత్ర పోషించింది. (ఒక్క రోజులో 6 వేలకుపైగా కేసులు)

కోయంబేడు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేశారు. ఈ ప్రభావం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు శివార్లకు పరిమితమయ్యే రీతిలో కట్టడి చర్యలు తీసుకున్నారు. ఇది కొంత మేరకు ఫలితాన్నిచ్చింది. కోయంబేడు నుంచి తేని వెళ్లి వైరస్‌ ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు శుక్రవారం మరణించాడు. తేని మీద నిఘా పెంచారు.  

పెరుగుతున్న కలవరం 
లాక్‌డౌన్‌ నాలుగో సారి పొడిగించినా ఆంక్షల సడలింపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కలిసి వస్తోంది. రాష్ట్రంలో 25 జిల్లాల్లో పూర్తిగా ఆంక్షలు సడలించారు. చెన్నై మినహా మిగిలిన 11 జిల్లాల్లో కొంత మేరకు సడలింపులిచ్చారు. విదేశాల్లో ఉన్న తమిళులు స్వస్థలాలకు తిరుగు పయనమవుతున్నారు. వీరి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని చెన్నై వైపుగా అనుమతించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి చెన్నైకి, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక రైలు సేవలు లేవు. కోయంబత్తూరు, మదురై వైపుగా ప్రత్యేక రవాణా సేవలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్ర ముంబై, ఒడిశా, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ నుంచి తమిళులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వీరికి రైల్వేస్టేషన్లు, ఆయా జిల్లాల సరిహద్దుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్, పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి, వైరస్‌ ప్రభావానికి గురికాకుండా ఉన్న వారిని వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లకు తరలిస్తున్నారు. కొందర్ని వారి ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచుతున్నారు. అయినా కరోనా కేసుల తీవ్రత మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో సైతం ప్రస్తుతం అమాంతంగా పెరుగుతుండడం కలవరంలో పడేసింది.  

ముంబై రూపంలో.. 
దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుగుపయనం అవుతున్న తమిళుల రూపంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధ, గురు, శుక్రవారాల్లో ముంబై, పరిసరాల నుంచి వచ్చిన వారిలో అత్యధిక శాతం మంది వైరస్‌ ప్రభావానికి లోనైనట్టు పరిశోధనలో తేలింది. గురువారం ముంబై నుంచి వచ్చిన వారిలో 76 మంది, శుక్రవారం వచ్చిన 56 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తంగా గురువారం 87 మంది, శుక్రవారం 68 మంది వైరస్‌ ప్రభావానికి గురికావడంతో ఆందోళన తప్పడం లేదు. బయట నుంచి వస్తున్న వారి రూపంలో అమాంతంగా కేసులు పెరిగాయి. ప్రధానంగా విరుదునగర్, తిరునల్వేలి, రామనాథపురం, తూత్తుకుడి, తేని, తిరువారూర్, దిండుగల్, పుదుకోట్టై, మధురై, కృష్ణగిరి, ఈరోడ్‌ జిల్లాల్లో ఈ కేసుల్ని గుర్తిస్తున్నారు. ఈ జిల్లాలన్నీ కరోనా భారి నుంచి బయట పడి ఉన్నాయి. మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతుండడంతో రెడ్‌జోన్ల సంఖ్య పెరిగేనా అనే అనుమానం కలుగుతోంది.  

పరిశోధనల ముమ్మరం 
చెన్నైలో అత్యధికంగా కరనో కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంతో పాటు కోయంబత్తూరు నగరం పరిధిలో అత్యధికంగా జనాభా కల్గిన ప్రాంతాల్ని ఎంపిక చేసి కరోనా పరీక్షల మీద ఐసీఎంఆర్‌ దృష్టి పెట్టింది. జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో 400 మంది చొప్పున రక్తనమూనాలను సేకరించి పరిశోధనల్ని ముమ్మరం చేశారు. ఈ విషయంగా ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ మనోజ్‌ మాట్లాడుతూ కోయంబత్తూరు, తిరువణ్ణామలై, చెన్నై రాష్ట్రంలో అత్యధిక జనాభా కల్గి ఉన్నట్టు వివరించారు. ఒక్కో నగరంలో పది మండలాలను ఎంపిక చేశామని, ఒక్కో మండలం నుంచి 400 మంది చొప్పున ఎంపిక చేసి రక్తనమూనాలను సేకరించి పరిశోధనలు సాగుతున్నాయన్నారు.

ప్రస్తుతం చెన్నైలో కంటోన్మెంట్‌ జోన్ల పరిధిలో ఐదు వేల మంది రక్తనమూనాల్ని సేకరించి పరిశోధన మీద దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. చెన్నైలో ఇదివరకు కోయంబేడు, రాయపురం మండలాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ప్రస్తుతం ఆ జాబితాలో తిరువీకానగర్‌ కూడా చేరింది. గత వారం వరకు కేసులు మరీ తక్కువగా ఉన్న అన్నానగర్‌ మండలంలో ప్రస్తుతం రోజుకు కనీసం 20 నుంచి 30 కేసులు బయట పడుతుండడంతో ఆందోళన రెట్టింపు అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement