
చెన్నై : పెళ్లికి నిరాకరించడంతో ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్‌ను తరగతి గదిలోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్‌లో విద్యార్ధులకు గణితం బోధించేందుకు స్కూల్‌కు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై తరగతి గదిలోనే నిందితుడు రాజశేఖర్ దాడి చేశాడు.
విద్యా సంస్థకు సమీపంలోనే బాధితురాలి ఇల్లు ఉండటంతో ఆమె ముందుగానే అక్కడికి చేరుకోగా అదును చూసి నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకే ఆమెపై నిందితుడు దాడికి తెగబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలేజీలో చదువుకునే సమయం నుంచి నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల కిందట ఆమెను వివాహం చేసుకుంటానని బాధితురాలి తల్లితండ్రులను రాజశేఖర్ సంప్రదించగా వారు అందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి నిరాకరించారనే ఆగ్రహంతో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment