పన్నీరు, నత్తం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ను బుజ్జగించేందుకు రాయబారాలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు మద్దతు నేత నత్తం విశ్వనాథన్ ద్వారా ఈ ప్రయత్నాలు సాగుతుండడం గమనార్హం. ఎట్టకేలకు అధికారిక సమీక్షకు పన్నీరు బుధవారం హాజరయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. మంగళవారం పన్నీరుసెల్వం మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పన్నీరు ఇంట సాగుతున్న పరిణామాలపై దృష్టిపెట్టినట్టుగా ఆ పార్టీ కో కన్వీనర్, సీఎం పళనిస్వామి సైతం వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. పొద్దుపోయే వరకు ఓ వైపు పన్నీరు నివాసంలో, మరో వైపు పళని నివాసంలో ముఖ్యనేతల భేటీలు సాగాయి. ఇది బుధవారం కూడా కొనసాగడం గమనార్హం. అయితే, పన్నీరును బుజ్జగించేందుకు ఆయన మద్దతుదారుడైన మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌ను అస్త్రంగా ప్రయోగించే పనిలో పళని శిబిరం నిమగ్నం కావడం చర్చకు దారి తీసింది.
ఓ వైపు పళని నివాసంలో, మరో వైపు పన్నీరు నివాసంలో అంటూ ఆయన అక్కడ..ఇక్కడ పరుగులతో మంతనాలు సాగించడం గమనార్హం. పన్నీరును బుజ్జగించి సామరస్య పూర్వకంగా ముందుకు సాగే రీతిలో నత్తం రాయబారాన్ని పళని సాగించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కుర్చీ విషయంలో పన్నీరు మెట్టు దిగనప్పటికీ, మంతనాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అధికారిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అయితే, సీఎం కార్యక్రమానికి మాత్రం వెళ్ల లేదు.
సమీక్షకు హాజరు..
సీఎండీఏలో సాగిన సమీక్షకు పన్నీరు వెళ్లారు. గృహ నిర్మాణాలతో పాటు ఇతర ›ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన తీరు తెన్నుల గురించి గంటన్నర పాటు అధికారులతో సమీక్షలో మునిగిన పన్నీరు, ఆ తర్వాత నివాసానికి వెళ్లారు. అక్కడ తన మద్దతు ముఖ్యనేతలతో మళ్లీ మంతనాల్లో మునిగి ఉండడంతో ఈ వివాదానికి తెరపడేదెప్పుడో అన్న ఎదురుచూపుల్లో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. మంత్రి జయకుమార్ తాజా వ్యవహారాలపై స్పందిస్తూ, అన్నాడీఎంకేలో విభేదాలు లేవని, పార్టీ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఈనెల ఏడో తేదీన చేయాల్సిన ప్రకటన వ్యవహారాలపై పార్టీ ముఖ్యులతో పన్నీరు భేటీల్లో ఉన్నట్టు పేర్కొన్నారు.
మంత్రి ఓఎస్ మణియన్ అయితే, అన్నాడీఎంకేలో పోరు లేదు..వార్ లేదు అంతా ఒక్కటే అని, మీడియా రాద్ధాంతం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరానికి పుండుమీద కారం చల్లినట్లయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామినే అని ఇందులో ఎటువంటి మార్పు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి ఆజ్యం పోశాయి.
Comments
Please login to add a commentAdd a comment