Pannir selvam
-
రెండాకుల ముసలం.. వేరుపడిన కమలం
పంతం పట్టు వీడనంది.. బంధం బీటలు వారింది..ఫలితం రెండాకుల కూటమి నుంచి కమలం వేరుపడింది. పురిట్చితలైవి జయలలిత మరణానంతరం జోడీ కట్టిన అన్నాడీఎంకే, బీజేపీ నగరపాలక ఎన్నికల్లో తమదారులు వేరంటూ విడిపోయాయి. అయితే రాష్ట్రంలో వేరుపడినా.. కేంద్రంలో దోస్తీలమే అంటూ తమ కటీఫ్ కహానీకి కొత్తఅర్థం చెప్పాయి. సాక్షి, చెన్నై(తమిళనాడు): అన్నాడీఎంకేతో అనుబంధాన్ని బీజేపీ తాత్కాలికంగా తెంచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆ పార్టీతో కటీఫ్ చెబుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోమవారం అధికారికంగా ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ముగించారు. గత కొద్దిరోజులుగా.. తమిళనాడులో ఈనెల 19న నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. యథాప్రకారం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఆ రెండు కూటములు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై గత కొన్నిరోజుల్లో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే–బీజేపీ సైతం సీట్ల పంపకంపై ఎడతెగని చర్చలు జరిపాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అన్నాడీఎంకే–బీజేపీ మధ్య చాపకింది నీరులా పెరిగిపోతున్న అగాధం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బట్టబయలైంది. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, పీఎంకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. డీఎంకే కూటమిలో ఎడతెగని పంచాయితీ ఇదిలా ఉండగా, డీఎంకే కూటమిలో సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. అన్నాడీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డీఎంకే కూటమి భావిస్తూ జాబితా విడుదలలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థల ఖరారులో ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన జాబితాను డీఎంకే కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఈ జాబితాను పరిశీలించి మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా తమ కూటమి నుంచి బీజేపీ దూరం జరగడంతో అన్నాడీఎంకే సోమవారం రెండో, మూడో జాబితాలను విడుదల చేసింది. కాగా సీట్ల సర్దుబాటుపై డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నియమించిన ఆ పార్టీ అగ్రనేత రమేష్ చెన్నితాల సోమవారం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న డీఎండీకే 100మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. చర్చలు విఫలం.. కాగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గతనెల 29వ తేదీన సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగినందున 30శాతం సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబట్టగా అన్నాడీఎంకే ఐదు శాతం మాత్రమే ఇస్తామని చెప్పింది. బీజేపీ క్రమేణా 18 శాతానికి దిగిరాగా అన్నాడీఎంకే మాత్రం 8 శాతానికి మించి ఇచ్చేది లేదని తెలిపింది. తుది ఆఫర్‌గా 11 శాతం అంటూ ద్వితీయశ్రేణి నేతలతో బీజేపీకి అన్నాడీఎంకే ఆదివారం కబురుపంపింది. అయితే 18 శాతం కంటే తగ్గేదిలేదని కమలనాథులు ఖరాఖండీగా బదులిచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయడంతో కమలనాథులు ఖంగుతిన్నారు. బీజేపీతో మళ్లీ చర్చలకు తావులేకుండా ఎడపాడి పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సోమవారం ఎలాంటి పిలుపురాలేదు. తాజా పరిణామంపై అన్నామలై సోమవారం హడావిడిగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అగ్రనేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నామలై మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు దిగుతోందని ప్రకటించారు. తాము కోరినన్ని స్థానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో 2024 పార్లమెంటు ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కుర్చీ కొట్లాట: పన్నీరుకు బుజ్జగింపు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ను బుజ్జగించేందుకు రాయబారాలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు మద్దతు నేత నత్తం విశ్వనాథన్ ద్వారా ఈ ప్రయత్నాలు సాగుతుండడం గమనార్హం. ఎట్టకేలకు అధికారిక సమీక్షకు పన్నీరు బుధవారం హాజరయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. మంగళవారం పన్నీరుసెల్వం మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పన్నీరు ఇంట సాగుతున్న పరిణామాలపై దృష్టిపెట్టినట్టుగా ఆ పార్టీ కో కన్వీనర్, సీఎం పళనిస్వామి సైతం వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. పొద్దుపోయే వరకు ఓ వైపు పన్నీరు నివాసంలో, మరో వైపు పళని నివాసంలో ముఖ్యనేతల భేటీలు సాగాయి. ఇది బుధవారం కూడా కొనసాగడం గమనార్హం. అయితే, పన్నీరును బుజ్జగించేందుకు ఆయన మద్దతుదారుడైన మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్‌ను అస్త్రంగా ప్రయోగించే పనిలో పళని శిబిరం నిమగ్నం కావడం చర్చకు దారి తీసింది. ఓ వైపు పళని నివాసంలో, మరో వైపు పన్నీరు నివాసంలో అంటూ ఆయన అక్కడ..ఇక్కడ పరుగులతో మంతనాలు సాగించడం గమనార్హం. పన్నీరును బుజ్జగించి సామరస్య పూర్వకంగా ముందుకు సాగే రీతిలో నత్తం రాయబారాన్ని పళని సాగించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కుర్చీ విషయంలో పన్నీరు మెట్టు దిగనప్పటికీ, మంతనాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అధికారిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అయితే, సీఎం కార్యక్రమానికి మాత్రం వెళ్ల లేదు. సమీక్షకు హాజరు.. సీఎండీఏలో సాగిన సమీక్షకు పన్నీరు వెళ్లారు. గృహ నిర్మాణాలతో పాటు ఇతర ›ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన తీరు తెన్నుల గురించి గంటన్నర పాటు అధికారులతో సమీక్షలో మునిగిన పన్నీరు, ఆ తర్వాత నివాసానికి వెళ్లారు. అక్కడ తన మద్దతు ముఖ్యనేతలతో మళ్లీ మంతనాల్లో మునిగి ఉండడంతో ఈ వివాదానికి తెరపడేదెప్పుడో అన్న ఎదురుచూపుల్లో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. మంత్రి జయకుమార్ తాజా వ్యవహారాలపై స్పందిస్తూ, అన్నాడీఎంకేలో విభేదాలు లేవని, పార్టీ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఈనెల ఏడో తేదీన చేయాల్సిన ప్రకటన వ్యవహారాలపై పార్టీ ముఖ్యులతో పన్నీరు భేటీల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మంత్రి ఓఎస్ మణియన్ అయితే, అన్నాడీఎంకేలో పోరు లేదు..వార్ లేదు అంతా ఒక్కటే అని, మీడియా రాద్ధాంతం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరానికి పుండుమీద కారం చల్లినట్లయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామినే అని ఇందులో ఎటువంటి మార్పు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి ఆజ్యం పోశాయి. -
ఎవరి లెక్కలు వారివే!
సాక్షి, చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు తమిళ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలు, గెలుపు స్థానాల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. వివాదాలకు చోటు ఇవ్వకుండా తమ మద్దతు దారులకు సమంగా సీట్లను పంచేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్, కో కన్వీనర్ పళని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక, తమ గెలుపు ఖాయమన్నట్లు సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్య తగ్గించేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కసరత్తులు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 2021 సార్వత్రిక నగారా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌లో మోగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహూ కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 16న నమూనా ఓటరు జాబితా, జనవరి 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటించ బోతున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబరు 15 వరకు ఓటరు జాబితాలో ఆన్లైన్ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా, తమిళ పార్టీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసుకుని కసరత్తుల వేగాన్ని పెంచాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకేలు ముందు ఉండగా, మేము సైతం అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. సమానంగానే పంపకాలు.. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు అన్నాడీఎంకే నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి శిబిరాలు సమానంగా సీట్లను పంచుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీకి 20, పీఎంకేకు 20, డీఎండీకేకు ఓ ఐదు, మిగిలిన మిత్రులకు తలా ఒకటి రెండు అప్పగించి, కనీసం 180 స్థానాల్లో పోటీ లక్ష్యంగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుంన్నాయి. బీజేపీ కలిసి రాకపోతే పీఎంకేకు మరో ఐదు సీట్లు ఇచ్చి, మిత్రులకు తలా ఓ సీటు కోత పెట్టి, అవసరం అయితే, 200 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోన్నట్లు చర్చ సాగుతోంది. ఏ శిబిరం అయితే, అధిక స్థానాల్లో గెలుస్తుందో, వారే సీఎం అనే ఏకాభిప్రాయానికి సైతం రాబోతున్నారని ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఇందు కోసం మరి కొద్ది రోజుల్లో పార్టీ సర్వ సభ్యం సమావేశం కానున్నదని, ఇందులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. సర్వేలను నిజం చేద్దామంటూ.. డీఎంకే ఉదయ సూర్యుడి గెలుపు ఖాయమని ఓ సర్వేలో తేలింది. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బృందం ఓ నివేదికను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఇచ్చినట్టు సమాచారం. ఇందులోనూ అధికారం డీఎంకేకు ఖాయం అన్నట్టుగా ఉండటం గమనార్హం. అయితే డీఎంకే విజయం సాధించాలంటే అధిక స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆ పార్టీకి మిత్ర పక్షాలు ఎక్కువే అయినా, వారికి సింగిల్ డిజిట్ సీట్లతో సర్దుబాటుకు అవకాశం ఎక్కువే. ఇక్కడ సమస్య అంతా కాంగ్రెస్ రూపంలోనే. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63, 40 అంటూ సీట్లు కేటాయించినా, గెలిచింది సింగిల్ డిజిట్ మాత్రమే. ఈ దృష్ట్యా, ఈ సారి కాంగ్రెస్ ఆశించిన మేరకు సీట్లను డీఎంకే ఇచ్చే అవకాశాలు లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. 30 లోపు సీట్లను కాంగ్రెస్‌కు సర్దుబాటు చేసి, కనీసం 180కు పైగా స్థానాల్లో పోటీ లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టినట్లు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. డీఎంకే కూటమిలో సీఎం అభ్యర్థి స్టాలిన్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. గెలిపిస్తే...ఇనోవా ఎన్నికల వ్యూహాలకు ఆ పార్టీ నేత మురుగున్ పదునుపెడుతున్నారు. జిల్లాల నేతలతో సమావేశాలు, సమీక్షలు అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని గెలిపించే జిల్లా కార్యదర్శికి ఓ ఇన్నోవా కారు బహుకరించనున్నట్టు మురుగన్ ప్రకటించారు. కనీసం 25 మంది ప్రతినిధులు అసెంబ్లీలో ఈ సారి అడుగు పెట్టాల్సిందేనని, అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి ఎన్నికల కసరత్తుల వేగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, అన్నాడీఎంకే వద్ద కనీసం 40 నుంచి 50 మేరకు సీట్లను బీజేపీ ఆశించే అవకాశాలు ఉన్నాయి. -
తడబడి నిలబడిన.. ఈపీఎస్ – ఓపీఎస్!
చెన్నై: పురచ్చితలైవి జయలలిత ఆకస్మిక మరణానంతరం తమిళనాట ఏర్పడిన ఏఐఏడీఎంకే ప్రభుత్వం మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. అంతర్గత కలహాలు, అంతగా ప్రజాదరణ లేని నేతలతో ఎప్పుడు పడిపోతుందో అన్నట్లుగా ఉన్న ఈ.పళని స్వామి(ఈపీఎస్), ఓ.పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ల ప్రభుత్వం స్థిరంగా నిలిచి తలలుపండిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసింది. ఈపీఎస్, ఓపీఎస్..ఈ ఇద్దరు నేతల్లో దిగ్గజ నేత జయలలిత నమ్మిన బంటు ఒకరైతే, జయలలిత రాజకీయ ఉత్థాన పతనాలను దగ్గర్నుంచి చూసిన శశికళను ఒప్పించి, మెప్పించి ఎదిగిన నేత మరొకరు. తొలి వ్యక్తి ఓపీఎస్ రాజకీయాల్లో ఆరితేరిన వాడైనా పళని స్వామి రాజకీయ చతురతకు వెనక్కితగ్గక తప్పలేదు. నిజానికి టీటీవీ దినకరన్ పార్టీలో ఉన్నంత కాలం శశికళ అనుయాయుడిగా మాత్రమే పళనిస్వామి ఉండేవారు. శశికళ జైలుకెళ్లడంతో 2017 ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎడప్పాడి పళనిస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అంతగా అనుభవంలేని ఈపీఎస్‌కు తిప్పలు తప్పవని అప్పట్లో అంతా భావించారు. ప్రభుత్వం నిలుస్తుందో లేదోనన్న బెంగ మొదట్లో ఆయనలోనూ ఉంది. అదే భయాన్ని తన ఎమ్మెల్యేల మెదళ్లలోకి ఇంకేలా చేయడంలో సఫలీకృతమయ్యారు పళని స్వామి. కలిసికట్టుగా లేకున్నా, ఒకే మాటపై నిలబడకున్నా ప్రభుత్వం పడిపోవడమే కాదు, వారికి భవిష్యత్తు కూడా ఉండదని ఈపీఎస్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు ఆకళింపు చేసుకున్నారు. ఓపీఎస్‌నూ, ఆయన 10 మంది ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకోవడంతో జయలలిత లేకున్నా ఏఐఏడీఎంకే ప్రభుత్వం తమిళనాట సుస్థిరంగా నిలబడగలిగింది. బీజేపీ పాత్ర ఎంత? తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలను నిలువరించేందుకు ఈపీఎస్–ఓపీఎస్‌ల కలయిక అనివార్యమని చెప్పి ఇరుపక్షాలనూ ఒప్పించడంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగు మద్దతిస్తానని మాటిచ్చి.. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే– బీజేపీ పొత్తు కుదిరింది. అయితే, ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన డీఎంకే.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేక పోయింది. ఉప ఎన్నికల్లో ఈపీఎస్ ప్రభుత్వం నిలబడటానికి కావాల్సిన 9 సీట్లను ఏఐఏడీఎంకే దక్కించుకోగలిగింది. ఏమాత్రం అనుభవం లేని ఈపీఎస్ సారథ్యంలోని ఏఐఏడీఎంకే విజయాన్ని చూసి విస్తుపోవడం డీఎంకే వంతయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకోవడమే ఈపీఎస్ లక్ష్యం. అందుకే ఆయన ఎన్నికల్లో సీట్ల గెలుపుపైనే దృష్టిపెట్టారు. తన ఎమ్మెల్యేలకు కావాల్సిన కాంట్రాక్టులిచ్చి లక్ష్యం సాధించుకున్నారు. దీనికితోడు తమిళనాడులోని విక్రవాండీ, నాన్‌గునేరీ ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం ఈపీఎస్‌కి ఉన్న యాక్సిడెంటల్ సీఎం అన్న పేరును మార్చివేసి, ఆయన భవిష్యత్తును చెప్పకనే చెప్పింది. పన్నీర్ సెల్వంకు ఏం దక్కింది? ఈపీఎస్–ఓపీఎస్ వర్గాల కలయికతో పన్నీర్ సెల్వంకు ఏం మిగిలిందన్న విషయం పక్కనబెడితే ప్రభుత్వం మాత్రం నిలదొక్కుకో గలిగింది. ఓపీఎస్‌కి డిప్యూటీ సీఎం పదవి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి, పళనిస్వామి మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఫలితంగా ఓపీఎస్‌కు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేకుండా పోయాయి. దక్కిన డిప్యూటీ సీఎం పదవితోనూ పెద్దగా ఫలితం లేదన్నది వాస్తవం. తమ రెండు వర్గాల కలయికతో ఈపీఎస్‌కే తప్ప తనకు ఫలితం శూన్యమన్న విషయం ఓపీఎస్‌కు ఆలస్యంగా అర్థమైంది. దీంతోపాటు పార్టీ విలీనం తరువాత ఓపీఎస్ పక్షం ఎమ్మెల్యేలందరినీ ఏదో రకంగా ఈపీఎస్ తనవైపు తిప్పుకో గలిగారు. కేంద్రంలో ఓపీఎస్ కొడుక్కి సాయం చేస్తానన్న హామీ కూడా నెరవేకుండానే మిగిలిపోయింది. -
పన్నీర్ సెల్వానికి కన్నీరే మిగిలింది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుమారుడికి కేంద్ర మంత్రి పదవి ఖాయం...ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అని ఆనందపడిపోయిన ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు చివరికి కన్నీరే మిగిలింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పన్నీర్ ఢిల్లీలోనే తిష్టవేసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేకు నరేంద్రమోదీ అండగా నిలిచారు. అప్పటి తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు చేదోడువాదోడుగా నిలిచారు. శశికళ రాజకీయంతో పన్నీర్‌సెల్వం పదవీచ్యుతుడుకాగానే ఆయనకు అనుకూలంగా మోదీ పావులు కదిపారు. శశికళ జైలు కెళ్లగా ఎడపాడి సీఎం అయ్యారు. ఎలాగైన పన్నీర్‌ను సీఎం చేయాలని మోదీ తలంచినా కుదరలేదు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం మధ్య నెలకొన్న విబేధాలను రూపుమాపి ఏకం చేయడంలో మోదీ తెరవెనుక పాత్ర ఉంది. ఈ రకంగా మోదీకి ఎడపాడి కంటే పన్నీర్‌సెల్వమే సన్నిహితుడు. ఈ ధైర్యంతోనే తన కొడుకు రవీంద్రనా«థ్‌కుమార్ చేత రాజకీయ అరంగేట్రం చేయించి లోక్‌సభ స్థానం పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కస్థానం కూడా గెలవకపోవడంతో మిత్రపక్ష అన్నాడీఎంకే ఏకైక విజేత రవీంద్రనాథ్‌కుమార్‌కు కేంద్రంలో మంత్రిపదవి ఖాయమని పన్నీర్ విశ్వసించారు. అయితే అన్నాడీఎంకే సీనియర్ నేతలను కాదని కొత్తగా వచ్చిన రవీంద్రనాథ్‌కుమార్‌కు అవకాశం ఇవ్వడం ఏమిటనే వాదనను లేవనెత్తారు. ఇందుకు అనుగుణంగా రాజ్యసభ సభ్యుడు వైద్యలింగం పేరును ఎడపాడి తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇరువురూ పోటీపడడం, తమిళనాడుకు రెండు మంత్రి పదవులు కుదరదు కాబట్టి రవీంద్రనాథ్‌కుమార్‌కు అవకాశం చేజారిపోయింది. పదవీ ప్రమాణం ముగియగానే సీఎం ఎడపాడి, మంత్రులు ఢిల్లీలోని తమిళనాడు భవన్లో రాత్రి బసచేసి శుక్రవారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. తేనీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రనా«థ్‌కుమార్ గెలుపొందగానే కేంద్రంలో మంత్రిపదవి ఖాయమనే ప్రచారం జరిగింది. మోదీ ప్రమాణ స్వీకారానికి మూడురోజులు ముందుగానే ఢిల్లీకి చేరుకున్న పన్నీర్ తన కుమారుడి కోసం మోదీ, అమిత్‌షాలను కలిశారు. దాదాపు ఖాయం చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి ఎడపాడి అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు వైద్యలింగంను మంత్రిపదవికి సిఫార్సు చేయడంతో బీజేపీలో ఆలోచనలో పడింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో చూసుకుందాములే అన్నట్లుగా చివరి నిమిషంలో వాయిదావేసింది. దీంతో డీలా పడిపోయిన పన్నీర్ ఢిల్లీలోనే తిష్టవేశారు. కుమారుడికి మంత్రి పదవి కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పదవి దక్కకున్నా గట్టి హామీనైనా పొందాలని పన్నీర్ పట్టుబట్టి ఉన్నట్లు సమాచారం. అధిష్టానమే చూసుకుంటుంది: బీజేపీ ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రంలో నుంచి ఎవరికి స్థానం కల్పించాలనే అంశాన్ని బీజేపీ అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంత్రివర్గంలో తమిళనాడుకు చోటు కల్పించడంపై పార్టీ పరిశీలిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఇలగణేశన్ తెలిపారు. -
మోదీ చెప్పినందుకే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకే ఏఐఏడీఎంకే పార్టీలోని తన వర్గాన్ని, సీఎం పళనిస్వామి వర్గంలో విలీనం చేసినట్లు తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వెల్లడించారు. తేని పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళతో విభేదించి ధర్మయుద్ధం జరుపుతున్న సమయంలో ప్రధాని మోదీని కలిసినట్లు చెప్పారు. అయితే, పార్టీ పదవి చేపడతానని ప్రధానికి తెలపగా, ఆయన మాత్రం మంత్రివర్గంలోనే చేరాలని సలహా ఇచ్చారన్నారు. అనంతరం రెండు వర్గాల విలీనంతో మంత్రి పదవి చేపట్టినట్లు చెప్పారు. అమ్మ దయవల్లే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. ఆ గౌరవం తనకు చాలుననీ, పదవులపై వ్యామోహం లేదని చెప్పారు. శశికళ, టీటీవీ దినకరన్ కారణంగా తాను పడిన కష్టాలు, సంక్షోభం మరొకరు ఎదుర్కొని ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవారనీ, అమ్మ కోసమే ఇవన్నీ భరించాననీ తెలిపారు. అయితే, ప్రధానితో భేటీ ఎప్పుడు జరిగిందనే విషయం మాత్రం ఓపీఎస్ చెప్పలేదు. జయలలిత మరణం, తదనంతర పరిణామాలతో ఏఐఏడీఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళనిస్వామి నాయకత్వాల కింద రెండుగా చీలి, తిరిగి ఒక్కటయ్యాయి. -
పన్నీరు పట్టు
► హోం, డిప్యూటీకి ఒత్తిడి ►మరో రెండు కీలక శాఖలకు కూడా ►దీప ఫిర్యాదు ►బెదిరింపు ధోరణిలో పళని ►మాట మార్చిన ఎమ్మెల్యేలు విలీనం వ్యవహారంలో పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం తెరమీదకు మరికొన్ని డిమాండ్లను తెచ్చారు. తనకు హోం శాఖతోపాటు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే డిమాండ్‌ను అమ్మ శిబిరం ముందు ఉంచారు. అలాగే, ప్రజా పనులు, ఆర్థిక శాఖ తన శిబిరం ఎమ్మెల్యేలకు అప్పగించాలన్న ప్రతిపాదనను పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, ఈ రెండు శిబిరాల విలీనం నాటకాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల కమిషన్‌కు దీప ఫిర్యాదు చేశారు. . సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీన ప్రయత్నం ఆ పార్టీ కార్యాలయానికి కూత వేట దూరంలో ఆగింది. పన్నీరును అక్కున చేర్చుకునేందుకు సీఎం పళని నేతృత్వంలోని అమ్మ శిబిరం మూడు మంత్రి పదవులతో పాటు పార్టీ పరంగా కీలక పదవులను కూడా ఆఫర్ చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. శశికళ, దినకరన్‌లకు ఉద్వాసన వ్యవహారం మరి కొద్ది రోజుల్లో తేల్చేస్తామన్న సూచనను పన్నీరు శిబిరానికి పంపారు. తాజాగా, అమ్మ మరణం మిస్టరీ తేల్చేందుకు తగ్గ విచారణ కమిషన్ డిమాండ్‌ను పళని నెరవేర్చడంతో విలీనానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకునే పనిలో కేడర్‌తో మంతనాల్లో పన్నీరు నిమగ్నం అయ్యారు. అయితే, తాను సీఎంగా, పార్టీ కోశాధికారిగా చక్రం తిప్పి ఉన్న దృష్ట్యా, ఆ హోదాకు తగ్గట్టుగా పదువుల్ని కట్టబెట్టాలనే డిమాండ్‌ను అమ్మ శిబిరం ముందు పన్నీరు ఉంచినట్టు తెలిసింది. పార్టీలో కీలక పదవితో పాటుగా ప్రభుత్వంలో తనకు డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక, ప్రజా పనుల శాఖను అప్పగించాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డట్టు సమాచారం. అలాగే, తన శిబిరానికి చెందిన పాండియరాజన్, సెమ్మలైలకు మంత్రి పదవుల్ని కట్టబెట్టాలని సూచించారు. పన్నీరుతో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవుల్ని ఇచ్చేందుకు పళని అంగీకరించినా, శాఖల విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు అమ్మ శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత కీలక శాఖలను పన్నీరు ఆశిస్తుండడంతో ఆచి తూచి స్పందించేందుకు పళని వర్గం నిర్ణయించింది. ఈ విషయంగా ఇరు శిబిరాలు చర్చించుకుని రెండు మూడు రోజుల్లో విలీనం విషయంగా స్పష్టతను తెలియజేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా, డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నా, ఓవైపు పన్నీరు మెట్టుదిగక పోవడం, మరో వైపు దినకరన్ రూపంలో తనకు సంకట పరిస్థితులు బయలుదేరడంతో సీఎం పళని స్వామి సైతం బెదిరింపు ధోరణికి సిద్ధం కావడం గమనార్హం. గురువారం ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సహనం ఉన్నంతవరకు అన్నీ, తాను ఎవ్వరికీ భయపడనని, భయపడాల్సిన అవసరం లేదంటూ సీఎం స్పందించారు. మాట మార్చిన ఎమ్మెల్యేలు తన మద్దతు ఎమ్మెల్యేలను పళని కిడ్నాప్ చేయించారని ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మాట మార్చడం గమనార్హం. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తామే దినకరన్ సభకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తిరుప్పర గుండ్రం ఎమ్మెల్యే బోసు, మేలూరు ఎమ్మెల్యే పెరియ పుల్లాన్, ఉసిలం పట్టి ఎమ్మెల్యే నీథిపతి గురువారం మీడియా ముందు స్పష్టంచేశారు. అన్నాడీఎంకేలో అందరూ ఒక్కటేనని, పళని, పన్నీరు, దినకరన్ తమకు సమానమేనని ఈ ముగ్గురు స్పందించడం ఆలోచించ దగ్గ విషయం. దీప ఫిర్యాదు అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీనం చివరి అంకాన్ని తాకిన నేపథ్యంలో, దివంగత సీఎం జయలలిత మేనకోడలు, ఎంజీయార్, అమ్మ, దీప పేరవై నేత దీప ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు శిబిరాల వ్యవహారాలను, గతంలో సాగిన పరిణామాలు గుర్తుచేస్తూ, అన్నీ నాటకాలేనని, రెండాకుల చిహ్నం తనకు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి విషయాన్ని త్వరితగతిన తేల్చాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. -
కమల్ మనలో ఒకడు
కాంచీపురం: సినీ నటుడు కమలహాసన్ ఒక తమిళుడు, మనలో ఒకడు అని పన్నీర్ సెల్వం తెలిపారు. కాంచీపురం జిల్లాలోని ముత్యాలపేటలో అన్నాడీఎంకే పుర ట్చి తలైవి అమ్మ విభాగం తరఫున శని వారం రాత్రి ఎంజీఆర్ శత వార్షికోత్సవాలు, పార్టీ అభివృద్ధి గురించి బహిరంగ సమావేశం శనివారం రాత్రి నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్వి.రంజిత్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ మైత్రేయన్ అధ్యక్షత వహించారు. మా జీ ముఖ్యమంత్రి, పార్టీ కోశాధికారి ఓ.పన్నీర్ సెల్వం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంజీఆర్ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమ్మ (జయలలిత) బాధ్యతలు చేపట్టి 27ఏళ్ల పాటు పార్టీ కోసం పాటుపడ్డారన్నారు. తమ పార్టీని మట్టుపెట్టాలని కరుణానిధి, ఆయన వర్గీయులు కలలు కంటున్నారని, వారి కలలు ఎప్పటికీ నెరవేరేది లేదన్నారు. రాజకీయ అక్రమాలను గురించి మాట్లాడడానికి అందరికీ హక్కు ఉందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, మాజీ మంత్రులు పొన్నయ్యన్, కేíపీ.మునుస్వామి, విశ్వనాథన్, సెమ్మలై పాల్గొన్నారు. ముం దుగా పన్నీర్‌సెల్వంకు ఆరు అడుగుల వెండి కరవాలాన్ని ఆర్వీ.రంజిత్‌కుమార్ బహూకరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రణరంగంగా మారిన చెన్నై
-
రణరంగంగా మెరీనా బీచ్
► పోలీస్‌స్టేషన్ దహనం ► వాహనాలు దగ్ధం ► ఆందోళనకారులపై లాఠీచార్జీలు ► సంఘ విద్రోహశక్తులుగా అనుమానం ► అట్టుడికిన రాష్ట్రం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీసింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాలని కోరినందుకు ఆగ్రహించిన ఆందోళనకారుల విధ్వంసంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. చెన్నైలో పోలీస్‌స్టేషన్ దహనం, వాహనాల దగ్ధం, లాఠీచార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలతో రాష్ట్రం రణరంగంగా మారిపోయింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల సంప్రదాయ జల్లికట్టుపై విధింపబడి ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరుతూ వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. మధురై జిల్లా అలంగానల్లూరులో ఈ నెల 16వ తేదీన, చెన్నై మెరీనాబీచ్‌లో 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీరికి మద్దతుగా రాష్ట్రం లోని ప్రజలంతా ఎక్కడికక్కడ ఉద్యమించారు. 20వ తేదీన భారీస్థాయిలో బంద్ నిర్వహించగా ప్రపంచమే నివ్వెరపోయేలా ఆందోళనకారులు బంద్‌ను విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అనుమతి తీసుకుని ఈ నెల 21వ తేదీన జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ వార్త వెలువడిన తరువాత కూడా ఉద్యమకారులు ఆందోళనను విరమించలేదు. చెన్నై మెరీనాబీచ్‌ను వీడిపోలేదు. ఆర్డినెన్స్ తాత్కాలిక ఊరట మాత్రమే, శాశ్వత చట్టం తెచ్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని భీష్మించుకున్నారు. రాష్ట్రం నలుమూలలా అదే జోరున జల్లికట్టు ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఆర్డినెన్స్ తెచ్చిన రోజున రెండుసార్లు మీడియా వద్దకు వచ్చిన సీఎం ఇది శాశ్వత చట్టంగా రూపొందుతుందని మొరపెట్టుకున్నా ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే వేడుకలకు ఇక మూడు రోజులే ఉన్న తరుణంలో, చెన్నై మెరీనాబీచ్‌రోడ్డే వేడుకలకు వేదిక కావడంతో ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేయించక తప్పలేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపినా, పలువురు ప్రముఖులతో చెప్పించినా వినకపోవడంతో పెద్ద సంఖ్యలో మెరీనాను చుట్టుముట్టారు. బతిమాలినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులను బలవంతంగా లాగివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో భాష్పవాయువును ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరు ఆందోళనకారులు సముద్రంలోకి వెళ్లి నిలబడి బెదిరించడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సముద్రంలోని వారికి ఆహారం, తాగునీరు అందకకుండా చేయడంతో ఒకరొకరుగా సముద్రం నుంచి వెలుపలకు వచ్చేశారు. జల్లికట్టు ఉద్యమకారులపై చెన్నైలో లాఠీచార్జీ చేశారనే సమాచారం రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. మధురై, కోయంబత్తూరు, విరుదునగర్, సేలం తదితర జిల్లాల్లో ప్రజలు రోడ్లపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అగ్నికి ఆహుతైన ఐస్‌హౌస్ పోలీసు స్టేషన్ చెన్నై మెరీనాతీరంలో పోలీసులు చెదరగొట్టిన ఆందోళనకారుల్లో 50 మంది అక్కడికి సమీపం ట్రిప్లికేన్ లోని ఐస్‌హౌస్ పోలీసు స్టేషన్ కు వచ్చి రెచ్చిపోయారు. పోలీసులు వారించినా వినిపించుకోకుండా పెట్రోలో బాంబులు విసిరారు. పోలీసు స్టేషన్ బైట తాళం పెట్టి దగ్ధం చేశారు. పోలీసు స్టేషన్ నుంచి మంటలు ఎగిసిపడుతుండగా లోన చిక్కుకుని ఉన్న 14 మంది సిబ్బంది కిటీకి తలుపులు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసు స్టేషన్ వాకిట ఉన్న ద్విచక్రవాహనాలు, నగరంలో కొన్ని చోట్ల నాలుగు కార్లను దగ్ధం చేశారు. పరస్పర దాడుల్లో పోలీసులు, ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు. లాఠీచార్జీకి నిరసనగా చెన్నైలోని అన్ని కూడళ్లలో కొందరు రాస్తారోకో చేసి అలజడి సృష్టించారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి చెన్నై మెరీనా తీరాన్ని పోలీసులు ఖాళీ చేయించగలిగారు. ఆందోళన వెనుక అదృశ్యశక్తులు ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగిన ఆందోళనలు సోమవారం అకస్మాత్తుగా ఉద్రిక్తతకు దారితీయడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రవేశపెట్టి ఉండవచ్చని అనే అనుమానం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. ఇది పసిగట్టే మెరీనా తీరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. అయితే అంతలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంత ఉద్యమంలో పోలీసులు జోక్యం చేసుకోవడమే ఉద్రిక్తతకు కారణమని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం రణరంగంగా మారిపోయిన తరుణంలో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. -
జల్లికట్టుకు పట్టు
► విపక్షాల ఆందోళనలు ► ప్రత్యేక చట్టం తేవాలని పీఎంకు సీఎం లేఖ ► నిషేధాన్ని అతిక్రమిస్తామని సవాళ్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: సంక్రాంతి పండుగ సమీపించడంతో జల్లికట్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పొంగల్పండుగ సందర్భంగా జల్లికట్టు జరిగి తీరాలని కోరుతూ రాజకీయ పార్టీలన్నీ పోరుబాటపట్టాయి. జల్లికట్టు అభిమానులు సైతం జల్లికట్టు జరుపుతామని ఘంటాపథంగా చెబుతున్నారు. జల్లికట్టు కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. తమిళుల పారంపర్య సంప్రదాయ క్రీడైన జల్లికట్టును ఈ ఏడాది నిర్వహించే తీరాలని అధికార అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. జల్లికట్టు క్రీడకు పేరొందిన అలంగానల్లూరులో ఈనెల 3వ తేదీన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆందోళన నిర్వహించారు. మదురైలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, తమిళనాడు మాని ల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ ఆందోళన చేపట్టారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ సోమవారం అలంగానల్లూరు వెళ్లి జల్లికట్టు కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. జల్లికట్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సభలో నినాదాలను లేవనెత్తారు. విద్యార్థులు, పలు సంఘాలకు చెందిన యువకులు మదురైలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని అతిక్రమించి క్రీడను నిర్వహిస్తామని నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ స వాల్ చేశారు. జల్లికట్టు ముగిసే వరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయరాదని సీఎంను కోరారు. జల్లికట్టు వంటి క్రీడను విదేశాల్లో బుల్‌ఫైట్ పేరుతో నిర్వహిస్తుంటారని నటుడు కమల్‌హాసన్ అన్నారు. అనేక దేశాల్లో ఎద్దులను మాంసంగా మారుస్తున్నా, భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో జల్లికట్టు ముగి సిన తరువాత వాటిని చక్కగా పోషిస్తారని పేర్కొంటూ సమర్థించారు. పీఎంకు సీఎం పన్నీర్ లేఖ: తమిళుల వంశపారంపర్య జల్లికట్టు క్రీడను యథావిధిగా నిర్వహించుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం లేఖ రాశారు. పొంగల్ పండుగ దినాల్లో సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అయితే 2014 మే 7వ తేదీన సుప్రీంకోర్టు నిషేధం విధించడం తమిళులను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం అనేకసార్లు కేంద్రానికి ఉత్తరం రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. జల్లికట్టు జరుపుకునేలా కేంద్రం ఒక అత్యసవర చట్టాన్ని తీసుకురావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. -
సంక్రాంతికి కొత్త సీఎం?
► శశికళ కోసం 12న ముహూర్తం ► నేటి నుంచి జిల్లాల వారీగా తీర్మానాలు ► 17వ తేదీన ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు తమిళనాడు ప్రజలు అత్యంత పవిత్ర దినంగా భావించే పొంగల్ పండుగ నాటికి శశికళను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ పరితపిస్తోంది. ఈనెల 12వ తేదీన సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టేలా పార్టీ అడుగులు వేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణించిన నాటి నుంచే శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులను శశికళకే కట్టబెట్టాలని పార్టీలోని అగ్రనాయకత్వం ఆశించింది. ఈ దశలో పేరుకు సీఎం పన్నీర్సెల్వంమైనా ప్రతిదీ శశికళ కనుసన్నల్లోనే సాగుతోంది. పన్నీర్‌సెల్వం సైతం దాదాపుగా ప్రతిరోజూ శశికళ వద్ద çహాజరీవేయించుకుంటున్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక సీఎం సీటే తరువాయిగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆమెపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మరీ ఎక్కువగా కాలికి బలపం కట్టుకుని ఊరువాడా తిరుగుతున్నారు. ఇతనికి మంత్రులు ఆర్పీ ఉదయకుమార్, కడంబూరు రాజా, సేవూరు రామచంద్రన్ తదితరులు తోౖడయ్యారు. కొత్త ఏడాదిరోజున అమ్మ సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించిన మంత్రులు శశికళను కలుసుకుని సీఎం బాధ్యతలు స్వీకరించాలని కోరారు. మంత్రులు ఓఎస్ మణియన్, తంగమణి వీరికి వంత పాడారు. ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు, పార్టీ అగ్ర నేతలంతా సోమవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్ లో శశికళతో సమావేశమై మరోసారి ఒత్తిడి తెచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల ఈనెల ఈ ఉత్సవాల నాటికి శశికళను సీఎం చేసి ఆమె నేతృత్వంలో శతజయంతి ఉత్సవాలు సాగాలని ఆశిస్తూ నుంచి∙ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి శశికళనే సీఎం అనే తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీ సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్రస్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించి చిన్నమ్మ శశికళను సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయనున్నారు. -
టాప్ హీరోలు!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టాప్ హీరోలుగా ఈ సారి కొందరే నిలిచారు. ఓట్ల చీలికతో ఈ సారి టాపర్ల సంఖ్య తక్కువే. గతంలో యాైభై, డెబ్బై, లక్షా అంటూ మెజారిటీల్ని దక్కించుకున్న వాళ్లు కూడా ఈ సారి పది, ఇరవై, ముప్పైలోపు పరిమితం కావాల్సి వచ్చింది. ఇందులో సీఎం జయలలిత, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్లు కూడా ఉన్నారు. ఇక, తామే హీరోలం అన్నట్టుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన పలువురు నలబై నుంచి డెబ్బై వేలలోపు ఓట్లతో టాప్ హీరోలుగా నిలిచారు. ఈ హీరోల్లో ప్రప్రథముడిగా తొమ్మిది పదుల వయస్సు దాటి పదమూడో సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న డీఎంకే అధినేత కరుణానిధి ఉన్నారు. కరుణానిధికి 68,366 ఓట్ల మెజారిటీ దక్కింది. తదుపరి ఒట్టన్ చత్రం నుంచి డిఎంకే తరపున ఎన్నికైన చక్రపాణి 65 వేల 711 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. తిరువణ్ణామలై నుంచి డిఎంకే తరపున ఎన్నికైన ఏవివేలు 50 వే ల 348, తిరుక్కోవిలూరు నుంచి డీఎంకే తరఫున పొన్ముడి 41,057 ఓట్ల మెజారిటీ పొందారు. తిరుపత్తూరు నుంచి డీఎంకే తరఫున ఎన్నికైన పెరియకరుప్పన్ 42004 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక, అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత కన్నా, ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు యాభై వేలకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, బోడి నాయకనూర్ నుంచి 53 వేల 107 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరో మంత్రి ఎస్పి వేలుమణి తొండాముత్తురులో 64,041 ఓట్ల మెజారిటీ, ఇంకో మంత్రి తంగమణి కుమర పాళయం నుంచి 47 వేల 329, ఎడపాడి నుంచి మంత్రి ఎడపాడి కె. పళని స్వామి 42,022 ఓట్ల మెజారిటీతో టాప్ హీరోలుగా అయ్యారు. ఘోరం: అత్యధిక మెజారిటీతో హీరోలుగా కొందరు అవతరిస్తే, మరి కొందరు హీరోలు అత్యధిక ఓట్ల మెజారిటీ తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఇందులో తొలి నేతగా డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి విజయకాంత్ నిలిచారు. ఆయన 47, 526 ఓట్లతో అన్నాడీఎంకే అభ్యర్థి కుమర గురు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. తదుపరి పీఎంకే సీఎం అభ్యర్థి 18,446 వేలతో ఓటమి ఎదు చవి చూడాల్సి వచ్చింది. -
తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తమిళనాడు ముఖ్యమత్రి పన్నీర్ సెల్వంకు లేఖ రాశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే పూర్తి వివరాలు సమర్పిస్తామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పన్నీరు సెల్వం పేర్కొన్నారు. ఆయన లేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. -
ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో ఏపీ డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. పలు తమిళ రాజకీయ పార్టీలు ఆంధ్రా ఆస్తులపై దాడి చేస్తామని హెచ్చరించాయి. తమిళ కూలీలెవ్వరూ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లొద్దంటూ సరిహద్దు వద్ద తమిళనాడు అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు.